30 May, 2026 | 11:03 AM

నవతరానికి స్ఫూర్తి.. విప్లవ సేనాని కటకం సుదర్శన్ జీవితం

30-05-2026 10:10 AM

రేపటికి అమరత్వానికి మూడేళ్లు..

బెల్లంపల్లి, (విజయక్రాంతి): భారత విప్లవోద్యమ ముద్దు బిడ్డ, నవమాసాలు మోసి కన్న విప్లవ నల్లనేల తొలుసూరి బిడ్డ మావోయిస్ట్ అగ్రనేతదండకారణ్యోద్యమానికి బాటలు వేసిన విప్లవ గెరిల్లా యోధుడు కటకం సుదర్శన్ (ఆనంద్ ) అసువులు బాసినేటికి మూడేళ్లు అవుతున్నది. విప్లవాల పురిటిగడ్డ బెల్లంపల్లి తొలితరం విప్లయోదుడు మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ దండకారణ్యంలో 2023 మే 31 న గుండెపోటుతో వీరమరణం పొందాడు. జనతన సర్కారులో నేలకోరిగి మూడేళ్లు అయినప్పటికీ ఆయన విప్లవ జాడలు ఇంకా సంజీవగంగానే ఉన్నాయి. అటు దండకారణ్య గిరిజనులు,ఇటు కోల్ బెల్ట్ కార్మిక లోకం హృదయాల్లో కటకం సుదర్శన్ గూడుకట్టుకుని పదిలంగా ఉన్నాడు. విప్లవ మార్గంలో వేలాది మంది ప్రాణాలను త్యాగాలు చేసిన సహచర విప్లవకారులు గజ్జల గంగారం, పెద్ది శంకర్, పులి మధునయ్య, గెల్లి రాజలింగు, కట్ల మల్లేష్, మాదిరెడ్డి సమ్మిరెడ్డి, గజ్జల సరోజ తోపాటు కోల్ బెల్ట్ విప్లవోద్యమంలో కార్మిక రాజ్యం కోసం తమ నెత్తురు దార బోసిన వేలాది విప్లకారుల త్యాగాలను కటకం సుదర్శన్ స్మరణ నేపద్యంలో మరోసారి జ్ఞాపకం చేసుకుంటున్నారు.

బెల్లoపల్లి కన్నాలబస్తీ లో సామాన్య కార్మిక కుటుంబంలో పుట్టిన ఆయన పేదల బ్రతుకులు మార్చాలని బందూకు పట్టారు. కటకం మల్లయ్య,వెంకటమ్మ దంపతులకు నలుగురు కుమారులు,ఒక కుమార్తె. సుదర్శన్ పెద్దకొడుకు. విద్యార్థి దశలోనే విప్లవరాజకియాలకు దగ్గరయ్యాడు. గనుల్లో బాయి దొరలు, బస్తీల్లో గూoడాల ఆగడాలపై తిరగబడ్డారు. అటు బాయి దొరలు ఇటు బస్తీ గుండాల అరాచకాలకు అంతేలేని స్థితి  అప్పటి యువతను విప్లవ మార్గం పట్టించిoది. బెల్లంపల్లిలో కరుడు గట్టిన గూండాలు కుందేళ్ళ శంకర్, దస్తగిరిలను జంటగా హతమార్చి ప్రజలకు పట్టిన పీడ విరగడ చేశారు. ఈ జంట హత్యలు  సుదర్శన్, గంగన్న నాయకత్వంలో జరిగాయి. మరో సంఘటన  బాయిదొర కొడుకు రఘు చేతిలో అత్యాచారం, హత్యకు గురైనా రాజేశ్వరి ఘటనకు వ్యతిరేకంగా కటకం సుదర్శన్, పెద్ది శంకర్, గంగన్న,రాడికల్ విద్యార్థులుగా  ముందునిలిచారు. దొరకొడుకు రఘు ను శిక్షించాలని  ప్రజలు, మహిళలు చేసిన తిరుగుబాటుకు వారే నాయకత్వం వహించారు. బజారు ఏరియాలో ఊరేగింపు పై పోలీసులు కాల్పులు జరిపారు. రక్తసిక్తమైన ఈ సంఘటన రాష్ట్రంలో అప్పట్లో సంచలనం సృష్టించిoది.

రాడికల్ విద్యార్థులుగా అన్నిరకాల ఫీడనలకు వ్యతిరేకంగా ప్రజల  పక్షాన మిలిటెంట్ పోరాటాలు చేశారు.1978లో సుదర్శన్ అడవి బాట పట్టారు. అప్పటి పీపుల్స్ వార్ అదిలాబాద్ జిల్లా ఫారెస్టు డివిజన్ కమిటీ కార్యదర్శిగా సుదర్శన్ తొలుత బాధ్యతలు చేపట్టారు. విప్లవోద్యమమంలో అంచెలంచెలుగా ఎదిగారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడయ్యూరు. అన తికాలంలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా కీలక బాధ్యతలు చేపట్టి దేశవ్యాప్తంగా విప్లవోద్యమo విస్తరించడంలో తనవంతు భూమిక పోషించారు. మావోయిస్టు పార్టీ అస్తున్నత సైనిక విభాగం మిలిటరీ కమిషన్(సీ.ఏం.సీ.) ఇంచార్జిగా కూడా కొంతకాలం పనిచేశారు. సైనికంగా పార్టీని అత్యున్నతంగా తీర్చిదిద్దడంలో శక్తివంచన లేకుండా పనిచేశారు. నగ్జబరి, శ్రీకాకుళం సాయిధ విప్లవ నిప్పురవ్వ దావానంలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నలుమూలలా విస్తరించింది. అప్పటి పీపుల్స్ వార్ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో దేశవ్యాప్తంగా మావోయిస్ట్ ఉద్యమం విస్తరించింది. ఐదు దశాబ్దాల విప్లవోద్యమ చరిత్రలో దండకారణ్యంలో జనతన సర్కారు లు ఏర్పాటులో కటకం  సుదర్శన్ పాత్ర మహోన్నతమైంది.

ప్రత్యామ్నాయ విప్లవ రాజ్యాధికారం గిరిజనుల బ్రతుకులో నూతన విప్లవ జీవితాన్ని ఆవిష్కరించింది. జనతన సర్కార్ ప్రత్యామ్నాయ విప్లవ వ్యవస్థకు బీజం  వేసింది. ఐదు దశాబ్దాల ఉద్యమానికి జనతన సర్కారు పీడిత ప్రజలు లకు చుక్కానిగా నిలిచింది. జనతన సర్కార్ నిర్మాతల్లో ఒకరైన కటకం సుదర్శన్ తుది శ్వాస వరకూ దండకారుణ్య విప్లవ పురోగతికి ఎనలేని కృషి చేశారు. మావోయిస్టు పొలిట్ బ్యూరో టాప్ లీడర్లలో కటకం సుదర్శన్ మూడో ర్యాంక్ లో ఉంటాడనీ ప్రచారం. 2023లో మే 31న సెంట్రల్ కమిటీ మీటింగ్ ముగిసిన తర్వాత తన స్థావరంలో కి వచ్చిన క్షణాల్లోనే దూలదాదా గుండె నొప్పి తో కుప్పకూలి పోయాడు.

సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో ఎర్ర సైన్యం  విప్లవ సంప్రదాయాలతో జనతన సర్కారు విముక్తి ప్రాంతoలో  కేంద్రం కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్( దూల దాదా) అంతిమఘట్టాన్ని నిర్వహించారు. సంస్మరణ కు ముందే మావోయిస్టు పార్టీ  కటకం సుదర్శన్ స్మారకoగా దండకారణ్యంలోభారీ స్తూపం నిర్మించింది. దండకారణ్యంలో అమరుల స్మారక స్తూపాలను పోలీసులు నేలకూల్చారు. అందులో భాగంగా కటకం సుదర్శన్( దూలదాదా ) స్తూపాన్ని కూడా ప్ర భుత్వ పోలీసు బలగాలు కూల్చివేశాయి.  కటకం సుదర్శన్ మూడో వర్ధంతి ఈ  నెల 31 న బెల్లంపల్లి కన్నాల బస్తీలో సోదరుడు కటకం సతీష్ తన ఇంటి వద్ద బంధుమిత్రులతో నిర్వహిస్తున్నారు. విప్లవమే జీవితంగా ప్రజలకోసం తుది శ్వాశ వరకూ సాయుధ విప్లవ మార్గంలో నడిచి ప్రాణం త్యాగం చేసిన మావోయిస్ట్ అగ్రనేత కటకం సుదర్శన్ విప్లవ జీవితం నవ తరానికి స్ఫూర్తి దాయకమని విప్లవాభిమానులు భావిస్తున్నారు.