తగ్గేదేలె!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే
- కేంద్రమంత్రుల బృందంతో ఖరాకండిగా చెప్పిన సీజేపీ
- ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు రూ. కోటి ఇవ్వడానికి, కేసుల ఎత్తివేతకు కేంద్రం సానుకూలం
- జేపీ నడ్డా, జితేంద్రసింగ్‌తో రెండు గంటలపాటు సీజేపీ ప్రతినిధుల చర్చలు
- ప్రధాన్ రాజీనామా చేసే ప్రసక్తే లేదు: ప్రభుత్వ వర్గాలు
న్యూఢిల్లీ, జూలై 24: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేదేలేదని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) శుక్రవారం ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అలాగే నీట్‌లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు కోటిరూపాయలు ఇవ్వాలని, జూలై 20న దాడి ఘటనకు విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా ఆ పార్టీ డిమాండ్ చేసింది. విద్యార్థులపై పెట్టిన కేసులన్నీ ఎత్తేయాలని స్పష్టం చేసింది.
మూడు డిమాండ్లలో రెండింటికి కేంద్రం సానుకూలం వ్యక్తం చేసిందని సీజేపీ పేర్కొంది. మృతిచెందిన వారి కుటుంబా లకు కేంద్రం రూ.కోటి పరిహారం ఇవ్వనున్నట్లు, కేసులను ఉపసంహరించుకోనున్నట్లు వెల్లడించింది. అయితే మూడోదైన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో శనివారం వరకు కేంద్రం గడవు కోరినట్లు సీజేపీ ప్రతినిధులు పేర్కొన్నారు. కేంద్రంతో సీజేపీ ప్రతినిధులు దాదాపు రెండు గంటలపాటు చర్చలు జరిపారు.
మరోపక్క ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశాన్ని ప్రభు త్వం తోసిపుచ్చింది. పదవి నుంచి వైదొలగడం అత్యంత సులభమని, అది బాధ్యత నుంచి పారిపోవడమే అవుతుందని, సరిదిద్దడంపై దృష్టి సారించనున్నట్లు తెలిపింది. కానిస్టిట్యూషన్ క్లబ్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రులు జేపీనడ్డా, జితేంద్రసింగ్‌కు తమ డిమాండ్ల లేఖను సీజేపీ ప్రతినిధులు అందజేశారు. ఈ భేటీ లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధా న్ రాజీనామా చేయాలనే తమ ప్రధాన డిమాండ్‌పై మరోసారి స్పష్టమైన వైఖరి తెలిపారు.
తమ అన్ని డిమాండ్లు నెరవేరే వరకూ ఆందోళనలను విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని సీజేపీ నేతలు సౌరవ్‌దాస్, అశుతోష్ రాంకా తెలిపారు. అలాగే లీకుల ఘటనలు పునరావృతం కాకుండా కొత్త చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. చర్చల అనంతరం మాట్లాడిన సౌరవ్‌దాస్.. మొత్తం మూడు ప్రధాన డిమాండ్లను కేంద్రం ముందుంచామని తెలిపారు.
ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించడానికి, నిరసనకారులపై నమోదైన కేసులను ఎత్తివేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు సౌరవ్‌దాస్ వెల్లడించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రేపటి వరకు కేంద్రం గడువు కోరిందని పేర్కొన్నారు. రేపటిలోగా ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయిస్తారని ఆశిస్తున్నాం. ఆయనను తొలగించకపోతే మరోసారి ఆందోళ నకు పిలుపునివ్వాల్సి వస్తుంది.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవరకు ఉద్యమం ఆగదని సౌరవ్‌దాస్ స్పష్టం చేశారు. తమ డిమాండ్లను వీలైనంత త్వరగా అంగీకరించాలన్నారు. లేనిపక్షంలో ఉద్యమం మరింత ఉధృతమవుతుందని, దేశవ్యాప్తంగా విస్తరిస్తుందని హెచ్చరించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకూ వెనక్కి తగ్గేదే లేదని సౌరవ్‌దాస్ పేర్కొన్నారు. కేంద్రంతో సీజేపీ చర్చలు జరిపడం ఇది మూడోసారి.
నేడు మళ్లీ చర్చిస్తాం: జేపీ నడ్డా
కాక్రోచ్ జనతా పార్టీ నేతలతో భేటీ అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మీడియాతో మాట్లాడారు. దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిగాయని తెలిపారు. సీజేపీ నేతలు తమ ముందు మూడు ముఖ్యమైన డిమాండ్లను ఉంచారని వెల్లడించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంపై శనివారం మధ్యాహ్నం మరోసారి వారితో చర్చలు జరుపుతామని జేపీ నడ్డా పేర్కొన్నారు.
ప్రధాన్ రాజీనామా చేసే ప్రసక్తే లేదు!
నీట్-యూజీ పేపర్ లీక్ వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశాన్ని ప్రభుత్వం తోసిపుచ్చింది. పదవి నుంచి వైదొలగడం అత్యంత సులభమైన విషయమని, అది బాధ్యత నుంచి పారిపోవడమే అవుతుందని శుక్రవారం అధికారవర్గాలు తెలిపాయి. దీంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 27 రోజుల పాటు నిరసన తెలుపుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)కి ఈ పరిణామం పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది.
ప్రభుత్వ వర్గాల ప్రకారం.. ప్రధాన్ రాజీనామా చేసే ప్రసక్తే లేదని సమాచారం. ‘రాజీనామా చేసి బాధ్యతల నుంచి పారిపోవడమే అత్యంత సులభమైన పని. ప్రజలు మాకు అధికారం అప్పగించారు, మేము దాన్ని నెరవేరుస్తాం’ అని పేర్కొన్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లోని వ్యవస్థాగత సమస్యలను సరిదిద్దడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపాయి.
నీట్ పేపర్ లీక్, పరీక్షా అవకతవకలపై నిరసనలకు నాయకత్వం వహిస్తున్న సీజేపీ, ప్రధాన్ రాజీనామా అనేది రాజీపడలేని డిమాండ్ అని పునరుద్ఘాటించిన రోజే ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. మంత్రిని మార్చడంపై కాకుండా, పరీక్షా విధానాన్ని సంస్కరించడం, పేపర్ లీక్ రాకెట్ల వెనుక ఉన్నవారిపై చర్యలు తీసుకోవడంపైనే తమ దృష్టి ఉంటుందని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

మౌనం వహించొద్దు: దీప్కే
ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్‌మంతర్ వద్ద తమ ఆందోళన చేస్తామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. ఇదే తమ ప్రధాన డిమాండ్ అని పేర్కొన్నారు. గతంలో తమకు ఆందోళనల నేపథ్యం ఏమీ లేదని, విద్యార్థుల భవిష్యత్ కోసమే పోరాడుతున్నామని దీప్కే స్పష్టం చేశారు.
విద్యావ్యవస్థ నిర్వీర్యం అవుతున్నందున దేశంలో యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అందుకే కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు.
కొందరు వ్యక్తులకు భయపడి ప్రశ్నించకపోతే భవిష్యత్‌ను అందుకోలేమని, ఇప్పుడు మౌనం వహిస్తే.. దేశం ఇంకెప్పటికీ ముందు కు సాగదని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ప్రజల మద్దతును ఎప్పటికీ మరిచిపోలేమన్నారు. కేంద్రంతో చర్చలు తటస్థ వేదికపైనే జరుగుతాయని స్పష్టం చేశారు. ధర్మేంద్రప్రధాన్‌ను మంత్రిపదవి నుంచి తొలగించా ల్సిందేనని దీప్కే డిమాండ్ చేశారు.






