25 July, 2026 | 2:02 AM

ఉద్యమాల జెన్ జీ

25-07-2026 01:27 AM
  1. హక్కుల సాకారం కోసం వీధుల్లోకి యువకులు
  2. హ్యాష్‌ట్యాగ్ నుంచి ఉద్యమం వరకు..
  3. ప్రభుత్వాలకు ప్రశ్నల అస్త్రాలు
  4. పార్టీలు సైతం మద్దతు తెలిపేలా.. 
  5. విధానాల్లో మార్పు వచ్చేలా ఒత్తిడి
  6. భవిష్యత్ ఉద్యమాల దిశను మార్చనున్న యువతరం

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): దేశంలో ఉద్యమాల రూపురేఖలు వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు రాజకీయ పార్టీ లు, విద్యార్థి సంఘాలు లేదా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నెలల తరబడి సన్నాహాలు చేసి ఉద్యమాలు జరిగేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. తమ సమస్యలపై పార్టీలు స్పందించాలని, ఉద్యమాలకు సహకరించాలని జెన్ జీ పాకులాడటం లేదు. తమ సమ స్యలపై వాళ్లే పోరుబాట పడుతున్నారు.

ఒక ఘటన, ఒక వీడియో, ఒక సోషల్ మీడియా పోస్టు చాలు. కొద్ది గంటల్లోనే వేలాది మంది యువత ఒకే వేదికపై చేరి ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. ఈ తరం ఉద్యమాలు నాయకుడి నేతృత్వంలో కాకుండా అంశాలే ఎజెండాగా ఉధృతంగా విస్తరిస్తున్నాయి. ఈ తరహా ఉద్యమాలకు లక్షలాది మంది మద్దతుదారులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా ఉన్న దేశాల్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది.

ప్రస్తుతం యువతే దేశానికి బలమైన మానవ వనరు. అలాంటి యువత తమ హక్కుల సాకారం కోసం పోరాడే పంథా మార్చింది. జెన్- జీ చేతుల్లోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్ ఉద్యమాలకు కొత్త దిశ చూపుతోంది. విద్యార్థులు, ఉద్యోగార్థులు, ఐటీ ఉద్యోగులు, మహిళలు, సామాజిక కార్యకర్తలు ఒకే అంశంపై ఒకేసారి స్పందించే పరిస్థి తి ఏర్పడటంతో ‘జెన్-జీ ఉద్యమాలు’ ఇప్పుడు పాలకులు, విధాన నిర్ణేతలు విస్మరించలేని శక్తిగా మారుతున్నాయి.

నేటి రాజకీయాల్లో యువత ఒక ‘ఓటు బ్యాంక్’ మాత్రమే కాదు, ‘ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే శక్తి’గా మారింది. దీంతో ఆయా పార్టీలే జెన్ జీ ఉద్యమాలకు స్వచ్ఛందంగా మద్దతు తెలిపే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. దీనికి ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఇతర పార్టీల నేతలు, తాజాగా తెలంగాణలోనూ కాంగ్రెస్ నాయకులు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం జెన్ జీ ఉద్యమానికి సంఘీభావం తెలపడమే యువత ఏ స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారో అర్థమవతుంది. 

విధానం మారే వరకూ ఉద్యమమే... 

ఇప్పటి జరిగిన అనేక ఉద్యమాల కంటే పూర్తి భిన్నంగా జెన్-జీ ఉద్యమాలు కనిపిస్తున్నాయి. ఈ తరం సంప్రదాయ రాజకీయాల కు పూర్తిగా దూరంగా ఉండటం గానీ, అలాగే ఏ ఒక్క పార్టీకి పూర్తిగా అనుకూలంగానూ ఉండడం లేదు. తమకు అన్యాయం జరిగిందని భావించినప్పుడు, లేదా సమాజంలో ఏదై నా సమస్య కనిపించినప్పుడు, రాజకీయ భేదాలకు అతీతంగా ఒక్కటయ్యే ధోరణి అవలం భిస్తుంది.

ప్రభుత్వ విధానాల్లో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా సాగుతున్న నేటి జెన్-జీ ఉద్యమాలు ప్రభుత్వాలను వెంటనే స్పందించేలా చేస్తున్నాయి. జెన్-జీ తరం గత ఉద్య మాల కంటే భిన్నంగా ఆలోచిస్తోంది. ఒక ప్రకటనతో లేదా ఒక ప్రెస్‌మీట్‌తో సంతృప్తి చెంద డం లేదు. ప్రభుత్వం ప్రకటించిన గడువు పాటించిందా? ఉద్యోగాలు నిజంగా భర్తీ అయ్యాయా? బడ్జెట్‌లో కేటాయించిన నిధు లు ఖర్చయ్యాయా? చట్టంలో మార్పులు జరిగాయా? వంటి అంశాలను పరిశీలిస్తూ ప్రభు త్వాలను నిరంతరం ప్రశ్నిస్తోంది.

సమస్యను స్పష్టంగా గుర్తించడం, ప్రభుత్వంతో నిరంతర చర్చలు జరపడం, చట్టపరమైన మార్గాలను వినియోగించడం, విధాన మార్పులకు స్పష్టమైన ప్రతిపాదనలు ఇవ్వడం, అమలును నిరంతరం పర్యవేక్షించడం వంటివి ఉద్యమంలో కీలకమని, ఈ కారణంగానే జెన్ జీ ఉద్యమం ఉధృతమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రాజకీయాలకు అతీతంగా వివిధ వర్గాల యువత భాగస్వా మ్యం, జాతీయ స్థాయిలో సంఘీభావం వ్యక్తం చేసే సామర్థ్యం, ఆన్‌లైన్ నిరసనలతో పాటు ఆఫ్‌లైన్ ఉద్యమాలను సమన్వయం చేయడం ద్వారా జెన్-జీ ఉద్యమాలు నేటి ప్రజాస్వామ్యం లో కొత్త రాజకీయ, సామాజిక శక్తిగా ఎదుగుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

రాజకీయ పార్టీల ప్రమేయం.. 

యువత ఉద్యమం ఎక్కడ ప్రారంభమైనా, దానికి రాజకీయ రంగు పులమడానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. నిరుద్యోగుల ఆందోళనలు, విద్యార్థుల నిరసనలు, మహిళల భద్రత, పరీక్షల్లో అవకతవకలు, సామాజిక న్యాయం వంటి అంశాలపై ఉద్యమాలు ఉధృతమైతే, అధికార--ప్రతిపక్ష పార్టీలు వెంటనే స్పందిస్తున్నాయి.

ఉద్యమ వేదికలకు వెళ్లి సంఘీభావం ప్రకటించడం, ప్రభుత్వంపై విమర్శలు చేయడం, యువతకు అండగా ఉంటామని హామీ ఇవ్వడం ఇప్పుడు దాదాపు అన్ని పార్టీల రాజకీయ వ్యూహంలో భాగమైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువత ఉద్యమాలకు పూర్తి మద్దతు ఇచ్చిన పార్టీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సమస్యల పరిష్కారంలో ఆలస్యం చేస్తున్నాయనే విమర్శలు తరచూ వినిపిస్తుంటాయి. నిరుద్యోగుల ఆందోళనలు, ఉద్యోగ నియామకాలపై నిరసనలు, విద్యార్థుల డిమాండ్లు---ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇవి కొనసాగుతున్నాయనే అభిప్రాయం ఉంది.

ఈ నేపథ్యంలో ‘ప్రభుత్వాలు మారుతున్నాయి... కానీ ఉద్యమాల కారణాలు ఎందుకు మారడం లేదు?’ అనే ప్రశ్న కూడా ముందుకు వస్తోంది. ఉద్యమాలు ఉధృతంగా ఉన్నప్పుడు రాజకీయ నాయకులు నిరసనల్లో పాల్గొంటారు. కానీ ఉద్యమం చల్లారిన తర్వాత ఇచ్చిన హామీల అమలు ఎంత వరకు జరుగుతుందన్నదే అసలు సమస్య. అనేక సందర్భాల్లో కమిటీలు, సమీక్షలు, ప్రకటనలు వస్తున్నా.. అమలు మాత్రం నెమ్మదిగా సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. 

భవిష్యత్తు ఉద్యమాల దిశ... 

భారతదేశంలో యువ ఉద్యమాలు ఇకపై కేవలం ఉద్యోగాలు, విద్య, రిజర్వేషన్లు వంటి సంప్రదాయ అంశాలకే పరిమితం అయ్యే అవకాశం కనిపించడం లేదు. సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పులు, డేటా గోప్యత, గిగ్ ఎకానమీ, స్టార్టప్‌లు, నైపుణ్యాభివద్ధి వంటి కొత్త అంశాలు రాబోయే రోజుల్లో యువ ఉద్యమాల ప్రధాన అజెండాగా మారే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోరాటాలు కొనసాగినా, భవిష్యత్తులో యువత దృష్టి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల నాణ్యత, స్టార్టప్‌లకు ప్రోత్సాహం, గిగ్ వర్కర్ల హక్కులు, నైపుణ్యాభివద్ధి, ఏఐ ప్రభావంతో మారుతున్న ఉపాధి అవకాశాలపై ఎక్కువగా కేంద్రీకతం కావచ్చు. కేవలం ఖాళీల భర్తీ కాకుండా, ‘నాణ్యమైన ఉపాధి’ అనే అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం ఉంది. పాలనను జవాబుదారీగా ఉంచే కొత్త రాజకీయ సంస్కఋతికి కూడా నాంది పలుకుతున్నాయి.

ఈ తరం నినాదాల కంటే ఫలితాలను, హామీల కంటే అమలును, భావోద్వేగాల కంటే డేటాను ఎక్కువగా నమ్ముతోంది. అందువల్ల భవిష్యత్తులో విజయవంతమయ్యే ఉద్యమాలు కేవలం జనసమీకరణతో కాకుండా, స్పష్టమైన లక్ష్యాలు, వాస్తవాధారాలు, చట్టపరమైన పోరాటం, నిరంతర ప్రజా ఒత్తిడితో ముందుకు సాగేవే అయ్యే అవకాశముందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణలోనూ పోరుబాట.. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఇచ్చిన ప్రధాన హామీల్లో ప్రభుత్వ ఉద్యోగాల కల్పన ఒకటి. రాష్ర్టం ఏర్పడితే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని ఆశించిన నిరుద్యోగులు, గత కొన్ని సంవత్సరాలుగా నియామకాల్లో జాప్యం, పరీక్షల వివాదాలు, ఖాళీల భర్తీ ఆలస్యం వంటి కారణాలతో తరచూ ఉద్యమ బాట పడుతున్నారు. దీంతో ఉద్యోగాల అంశం తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలక చర్చగా మారింది.

లక్షలాది మంది యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంవత్సరాలుగా కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతూ, కుటుంబాల ఆర్థిక భారం మోస్తూ, ఒక్క నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. నియామక ప్రక్రియలో జాప్యం ప్రతి సంవత్సరం వారి వయోపరిమితి, అవకాశాలపై ప్రభావం చూపుతోందని నిరుద్యోగ సంఘాలు చెబుతున్నాయి. టీఎస్‌పీఎస్సీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం తెలంగాణ నిరుద్యోగ యువతలో తీవ్ర నిరాశను కలిగించింది.

పరీక్షలు రద్దు కావడం, మళ్లీ నిర్వహించడం, నియామకాల్లో ఆలస్యం కావడం వల్ల వేలాది మంది అభ్యర్థులు మానసిక, ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఈ ఘటన తర్వాత పారదర్శక నియామక వ్యవస్థ, పరీక్షల భద్రత, సమయపాలనపై యువత మరింత గట్టిగా గళమెత్తుతోంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల భర్తీ వేగవంతం చేస్తామని ప్రకటించినప్పటికీ, అన్ని శాఖల్లో ఖాళీలను త్వరగా భర్తీ చేయాలని నిరుద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ప్రతి నోటిఫికేషన్‌కు స్పష్టమైన కాలపట్టిక, పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల, నియామక ఉత్తర్వులు సమయానికి ఇవ్వాలని యువత కోరుతోంది. తెలంగాణలో నిరుద్యోగుల ఉద్యమాలు ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా మరింత బలపడుతున్నాయి. ఉద్యోగార్థులు వాట్సాప్, టెలిగ్రామ్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల ద్వారా సమన్వయం చేసుకుని ధర్నాలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో స్థానిక సమస్యలు రాష్ట్రవ్యాప్త చర్చగా మారుతున్నాయి.

యువ ఉద్యమాలు..

* ఉద్యోగాల కోసం యువత పోరాటం : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జాప్యం, నియామక పరీక్షలలో అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, ఫలితాల ఆలస్యం వంటి అంశాలపై దేశంలోని అనేక రాష్ట్రాల్లో నిరుద్యోగ యువత పెద్దఎత్తున నిరసనలు చేపట్టింది. రైల్వే, సైన్యం, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల నియామకాలు, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ వంటి అంశాలపై నిరసనలు తరచూ చోటుచేసుకున్నాయి. పారదర్శకమైన, సమయబద్ధమైన నియామక ప్రక్రియ వంటి అంశాలను యువత ప్రధాన డిమాండ్ చేస్తుంది.

* విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం ఉద్యమాలు:  పోటీ పరీక్షల నిర్వహణ, ఫీజుల పెంపు, ప్రవేశ ప్రక్రియలో పారదర్శకత, పరీక్షల భద్రత వంటి అంశా లపై విద్యార్థి సంఘాలు, యువత దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించా యి. ఒక పరీక్షలో జరిగిన లోపం మరో రాష్ర్టంలోని విద్యార్థులనూ స్పందించేలా చేస్తోంది. డిజిటల్ వేదికల వల్ల ఈ ఉద్యమాలు వేగంగా విస్తరిస్తున్నాయి.

* మహిళల భద్రత కోసం యువత గళం : దేశంలో మహిళలపై జరిగిన దారుణ ఘటనల తర్వాత యువత పెద్దఎత్తున నిరసనలకు దిగిన సందర్భాలు అనేకం. న్యాయం కోసం కొవ్వొత్తుల ర్యాలీలు, శాంతియుత నిరసనలు, సోషల్ మీడియా ప్రచారాలు నిర్వహిస్తూ చట్టాల్లో మార్పులు, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను డిమాండ్ చేసింది. ఈ ఉద్యమాలు మహిళల భద్రతపై జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి.

* పర్యావరణం, వాతావరణ మార్పులపై యువత స్పందన : అడవుల సంరక్షణ, కాలుష్య నియంత్రణ, నీటి వనరుల పరిరక్షణ, వాతావరణ మార్పుల ప్రభావంపై కూడా యువత చైతన్యం పెరుగుతోంది. చెట్ల నరికివేత, పరిశ్రమల కాలుష్యం, నదుల పరిరక్షణ వంటి అంశాలపై స్థానిక ఉద్యమాలకు జాతీయ స్థాయిలో మద్దతు లభిస్తోంది. పర్యావరణాన్ని భవిష్యత్ తరాల హక్కుగా చూస్తూ యువత ఉద్యమాలు నిర్వహిస్తోంది.

* సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం పోరాటం : రిజర్వేషన్లు, సామాజిక సమానత్వం, వివక్ష, మానవ హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛ వంటి అంశాలపై కూడా యువత చురుకుగా స్పందిస్తోంది. ఏ వర్గానికైనా అన్యాయం జరిగిందని భావించినప్పుడు దేశవ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం చేస్తూ ఉద్యమాల్లో పాల్గొంటోంది.

* డిజిటల్ ఉద్యమాల ప్రభావం : నేటి యువ ఉద్యమాల్లో సోషల్ మీడియా ప్రధాన ఆయుధంగా మారింది. ఒక హ్యాష్‌ట్యాగ్, ఒక వీడియో, ఒక పోస్టు లక్షల మందిని ఒకే వేదికపైకి తీసుకువస్తోంది. ఆన్‌లైన్‌లో మొదలైన ప్రచారం కొద్ది గంటల్లోనే ఆఫ్‌లైన్ నిరసనగా మారుతోంది. దీంతో ప్రభుత్వాలు కూడా తక్షణ స్పందన ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.