30 May, 2026 | 12:08 PM

తహశీల్దార్ కార్యాలయంలో సిబ్బంది ఆలస్యంగా విధులకు.. ప్రజల నిరీక్షణ

30-05-2026 11:28 AM

బెజ్జంకి, మే30(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని తహశీల్దార్(Tahsildar Office) కార్యాలయంలో శనివారం ఉదయం 10:30 గంటలు దాటినా పలువురు సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వివిధ పనుల నిమిత్తం ఉదయం నుంచే కార్యాలయానికి వచ్చిన ప్రజలు అధికారులు, సిబ్బంది కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది. 

కార్యాలయం ఆవరణలో చెట్ల కింద కూర్చొని ప్రజలు నిరీక్షిస్తుండగా, లోపల పలువురు సిబ్బంది సీట్లు ఖాళీగా కనిపించాయి. ఒకరిద్దరు ఉద్యోగులు మాత్రమే కార్యాలయానికి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఆదాయ, భూ సంబంధిత పనులతో పాటు వివిధ ధ్రువపత్రాల కోసం వచ్చిన ప్రజలు సకాలంలో సేవలు అందక అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో విధి నిర్వహణ సమయాలను కచ్చితంగా పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ, బెజ్జంకి తహశీల్దార్ కార్యాలయంలో పరిస్థితి భిన్నంగా ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కార్యాలయ పనితీరుపై దృష్టి సారించి, ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలకు కోరుతున్నారు