25 July, 2026 | 2:49 AM

నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి

25-07-2026 02:00 AM

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎ.కోదండరాం

ముషీరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): నీట్ పేపర్ లికేజ్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా చేయాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు.

ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ లోయర్ ట్యాంక్బండ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ విద్యార్థి సమితి చేపట్టిన నిరసన కార్యక్రమంలో కోదండరాం హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో కాక్రోజ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనకు తెలంగాణ జన సమితి సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. వారికి మద్దతుగా తెలంగాణ రాష్ట్రంలో సంఘీభావ ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

విద్యార్థులు డిమాండ్ చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాతో పాటు, పేపర్ లికేజ్ కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థులకు ఒకొక్కరికి కోటి రూపాయలు పరిహారం చెల్లించాలన్నారు. అలాగే పేపర్ లికేజ్ కు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఢిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోదండరాం డిమాండ్ చేశారు. ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలో తెలంగాణ జన సమితి ప్రత్యేక్షంగా పాల్గొంటుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు,  విద్యార్థి సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.