25 July, 2026 | 2:27 AM

రేపు కొమురవెళ్లి రైల్వే స్టేషన్ ప్రారంభం

25-07-2026 01:32 AM
  1. డెమో రైలుకు జెండా ఊపనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
  2. పాల్గొననున్న కేంద్రమంత్రి బండి సంజయ్
  3. రూ.6 కోట్ల వ్యయంతో స్టేషన్ నిర్మాణం

హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రేపు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌తోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. అలాగే, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మ, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఈ సందర్భంగా కొమురవెల్లి పుణ్యక్షేత్రం స్టేషన్ నుండి సిద్దిపేట-సికింద్రాబాద్ డెమో రైలు నంబర్ 77654ను ప్రముఖులతో కలిసి కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభిస్తారు. ఎట్టకేలకు కొమరవెల్లి మల్లన్న ఆలయాన్ని సందర్శించే యాత్రికుల సౌకర్యార్థం, ఇటీవల వేసిన మనోహరాబాద్- సిద్దిపేట కొత్త రైలు మార్గంలో ఒక నూతన  రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. సుమారు రూ. 6 కోట్ల వ్యయంతో పూర్తి అయిన ఈ రైల్వే స్టేషన్‌లో హై లెవెల్ ప్లాట్ ఫారమ్‌తోపాటు పైకప్పు, వెయిటింగ్ రూమ్, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించారు.

ప్రస్తుతం సికింద్రాబాద్, సిద్దిపేట స్టేషన్ల మధ్యలో నాలుగు డెమో సర్వీసులు నడుస్తున్నాయి. వీటికి ఇప్పుడు కొమరవెల్లి పుణ్యక్షేత్రం స్టేషన్‌లో అదనపు స్టాపేజీని ఏర్పాటు చేశారు. ఉద్యోగులు, విద్యార్థులు వంటి స్వల్ప దూర ప్రయాణికుల అవసరాలను కూడా తీరుస్తుంది. ఈ స్టేషన్ ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడమే కాకుండా, ఈ ప్రాంతంలో సామాజిక-, ఆర్ధికాభివృద్ధి పెంపొందించడానికి కూడా సహాయపడనుంది.