ప్రధాని సభను విజయవంతం చేయాలి
బీజేపీ రాష్ట్ర నేత ఎడ్ల అశోక్ రెడ్డి
మహబూబాబాద్,(విజయక్రాంతి): రాష్ట్ర రాజధానిలో ఈనెల 10న ప్రధాని నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షులు ఎడ్ల అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిశీధర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎడ్ల అశోక్ రెడ్డి,జిల్లా ఇంచార్జ్ ఆరుట్ల దశమంత రెడ్డి పాల్గొన్నారు.
మే 10న నిర్వహించబడనున్న భారీ బహిరంగ సభపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించారు. పార్టీ బలోపేతం, ప్రజలతో అనుసంధానం, సభ విజయవంతం వంటి అంశాలపై నాయకులతో సమీక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ, హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ వద్ద ముఖ్య అతిథిగా విచ్చేసే ప్రధాని నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభను ఘనవిజయంగా నిర్వహించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి బూత్ స్థాయిలో కార్యకర్తలు చురుకుగా పనిచేసి ప్రజలను చైతన్యపరచాలని, సభకు భారీగా ప్రజలను సమీకరించాలని సూచించారు.
బూత్ ఫ్యామిలీ సభ్యులు, శక్తికేంద్ర ఇన్‌చార్జ్‌లు, మండల, జిల్లా స్థాయి నాయకులు సమన్వయంతో ముందుకు సాగాలని తెలిపారు. గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై పార్టీ సిద్ధాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నాయని, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం దేశానికి దిశానిర్దేశం చేస్తోందని నాయకులు పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఈ సభ కీలకమన్నారు.






