నోస్ పార్మా కంపెనీ అనుమతులు రద్దు చెయ్యాలి
తెలంగాణ ఉద్యమ నేత సంజయ్ దాస్ గౌడ్
చిట్యాల,(విజయక్రాంతి): నోస్ పార్మాసిటికల్ ల్యాబ్ కంపెనీ అనుమతులు రద్దు చెయ్యాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం రాత్రి ఈ కంపెనీ ప్రమాదంలో గాయపడిన కార్మికులకు ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. కంపెనీ వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని జరుగుతుందని, పర్యావరణానికి కూడా నష్టం వాటిల్లుతుందని ఆయన పేర్కొన్నారు. అనుమతులు రద్దు చేసి, కంపెనీని మూసివేయాలని డిమాండ్ చేశారు.
వివిధ కంపెనీలల్లో కార్మికుల భద్రత కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా అనేక ప్రమాదాల జరిగిన అధికారులు నామాత్రపు తూతూ మంత్రం చర్యలు చేపట్టారని, కార్మికులకు ఒరిగిందేమీ లేదని ప్రాణనష్టం, ఆరోగ్య నష్టం జరిగడం తప్ప కార్మికుల భరోసాకు దక్కినది ఏమి లేదన్నారు. అన్ని కంపెనీలలో గతంలో జరిగిన ప్రమాదాలు గాయపడిన ఇతర రాష్ట్రాల, స్వరాష్ట్ర కార్మికుల పరిస్థితిని అధ్యయనం చేయడానికి చిత్తశుద్దితో అధికారులు ప్రత్యేక విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
నోస్ కంపెనీ ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం జిల్లా కలెక్టర్ తో కలిసి కంపెనీని సందర్శించడం కార్మికులకు ఎంతో భరోసానిస్తుందని ఇలాంటి ప్రజానాయకుడు ఉండడం ఈ నియోజకవర్గ ప్రజల అదృష్టం అని తెలంగాణ ఉద్యమ నేత సంజయ్ దాస్ అన్నారు. ఘటనలో గాయపడ్డ కార్మికులకు అన్ని విధాల ఆదుకోవాలని దానికి విప్,ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రత్యేకంగా కృషి చేయాలని కోరారు.




