ప్రభుత్వ పాఠశాల సమస్యకు శాశ్వత పరిష్కారం : సర్పంచ్ నల్లమల్ల కీర్తి
* వర్షపు నీరు నిలవకుండా మట్టితో నింపిన వైనం
* విద్యార్థుల ఇబ్బందులు తొలగించడమే ధ్యేయం
* గ్రామ అభివృద్ధిపై సర్పంచ్ అహర్నిశల తపన...
తిరుమలాయపాలెం,(విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండల పరిధిలోని ఎర్రగడ్డ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ఎన్నో ఏళ్లుగా విద్యార్థులు, ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తున్న సమస్యకు గ్రామ సర్పంచ్ నల్లమల్ల కీర్తి చొరవతో శాశ్వత పరిష్కారం లభించింది. పాఠశాల ఆవరణలో ప్రతి వర్షాకాలంలో వర్షపు నీరు నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. సమస్యను గమనించిన సర్పంచ్ కీర్తి వెంటనే స్పందించి, పాఠశాల మైదానాన్ని మట్టితో నింపించి చదును చేయించారు.
దీంతో పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా మారి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలకు రావడానికి అవకాశం ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. గ్రామంలో విద్య, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న సర్పంచ్ నల్లమల్ల కీర్తి సేవలను గ్రామస్తులు అభినందించారు. పాఠశాల సమస్యను పరిష్కరించి విద్యాభివృద్ధికి తోడ్పాటునందించినందుకు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.






