మొబైల్ యాప్ తో సంబంధం లేకుండా యూరియా ఇతర ఎరువులు సబ్సిడీపై రైతులకు ఇవ్వాలి
- అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) డిమాండ్
గుండాల,(విజయక్రాంతి): మొబైల్ యాప్ లతో సంబంధం లేకుండా యూరియా, ఇతర ఎరువులు సబ్సిడీ ద్వారా రైతులకు అందజేయాలని, నకిలీ విత్తనాలను అరికట్టాలని, నకిలీ విత్తనాలు సప్లై చేసే డీలర్లపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని అఖిల భారత రైతు కూలి సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో రైతులతో భారీ ర్యాలీ నిర్వహించి, మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ గుగులోత్ సైదుల్ కి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ మండల అధ్యక్షులు గడ్డం లాలయ్య అధ్యక్షతన జరిగిన సభలో గౌరవ అధ్యక్షులు వి కోటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు కల్తీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు ప్రభుత్వమని చెప్పుకుంటూ రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నాయి తప్ప ఆచరణలో రైతుల కోసం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
గత సంవత్సరం రైతులకు యూరియా దొరకక సగం రైతులు మొక్కజొన్న, వరి, పత్తి పంటలను వదిలేశారని ఆందోళన వ్యక్తం చేశారు. గుండాల మండలం పూర్తిగా ఏజెన్సీ మండలమని, ఇక్కడ యాప్ ల ద్వారా యూరియా బస్తాలు ఇస్తామంటే మొబైల్ సెల్లు లేని వారి పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. ఈ మండలం పట్టణ ప్రాంతాలకు 60 కిలోమీటర్ల దూరంలో ఉందని, ఈ మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నేతకాని సంఘం నాయకులు గాంజర్ల నిత్యానందం ఈ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు.






