ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్,(విజయక్రాంతి): నిరుపేదలకు నీడ కల్పించాలన్నా ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం అయ్యేలా క్షేత్రస్థాయిలో పని చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. శనివారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై గృహ నిర్మాణ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాకు మంజూరు అయిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిని ఆయా మండలాల వారీగా సమీక్షిస్తూ, అధికారులకు పలు సూచనలు చేశారు.
జిల్లాకు మంజూరైన (8953) ఇళ్లకు గాను 81. శాతంతో (7271) ఇళ్లకు గ్రౌండింగ్ పూర్తి అయిందని తెలిపారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, క్షేత్రస్థాయిలో ప్రతి రోజూ పర్యటించి, నిర్మాణాలు వేగవంతం అయ్యేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి వారం స్టేజీలవారీగా ఇళ్లను తుది దశకు పురోగతిలోకి తీసుకురావాలన్నారు. ఇసుక, గ్రావెల్ విషయంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ అధికారులను ఆదేశించారు. ఇప్పటికీ ప్రారంభించని ఇండ్లను వెంటనే ప్రారంభించి జూలై 15 వరకు పూర్తి చేయాలన్నారు.
ప్రతి రోజూ ఎన్ని ఇళ్లు పూర్తి అవుతున్నాయన్న అంశం మీద సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. దారిద్య రేఖకు దిగువన ఉండి ఇండ్లు నిర్మించుకోలేని నిరుపేదలు మహిళా స్వయం సహాయక సభ్యులుగా ఉన్నట్లయితే డి ఆర్ డి ఓ ఆధ్వర్యంలో రుణాలు మంజూరు చేసి ఇండ్లు నిర్మించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని డి ఆర్ డి ఓ ను ఆదేశించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో ఇప్పుడు గుడిసెలో నివసించే వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ముందుకు పోతున్నామన్నారు.
రాష్ట్రాన్ని గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ఆదేశాలతో అన్ని గ్రామాలు, నగర జనాభా ప్రాతిపదికన ఇళ్లు కేటాయించి లబ్ధిదారులను గుర్తించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందుకుగాను ప్రత్యేక అధికారులు జిల్లాలోని ఆయా మండలాల్లో గుడిసెల్లో నివసించే వారిని త్వరితగతిన గుర్తించి నివేదికలు అందజేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని అన్ని నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని సూచించారు.






