ఐటీఐల ఆధునీకరణతోనే యువతకు ఉపాధి
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి, మే 13 (విజయక్రాంతి): జిల్లాలోని యువతకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు అందించి, సుస్థిర ఉపాధి కల్పించడమే లక్ష్యంగా (పీఎం సేతు) పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు.
బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)లో సంబంధిత శాఖలు మరియు పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 50%, రాష్ట్ర ప్రభుత్వం 33% శాతం శిరదం మరియు పరిశ్రమలు 17% శాతం నిధులను భరిస్తాయని, రాబోయే ఐదేళ్లలో పెద్దపల్లి క్లస్టర్ పరిధిలోని ఐటీఐల అభివృద్ధికి కేంద్రం రూ. 120 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 80 కోట్లు వెచ్చించనున్నాయని, పారిశ్రామిక భాగస్వాముల ద్వారా రూ. 40 కోట్లు సేకరించాల్సి ఉంటుందని, జిల్లాలోని ప్రధాన పారిశ్రామిక సంస్థలైన సింగరేణి, ఎన్టీపీసీ లతో భాగస్వామ్యం కోసం చర్చలు జరుపుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ సంస్థలు తమ CSR నిధుల నుంచి ఏటా సుమారు రూ. 5 కోట్లు కేటాయించేలా ఒప్పందాలు చేసుకోనున్నట్లు పేర్కొన్నారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఐటీఐలను ఆధునీకరించి, యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా వారికి మెరుగైన భవిష్యత్తు లభిస్తుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఓ రవీందర్, సింగరేణి ఆర్జీ 1, 2, 3 అధికారులు, ఎన్టీపీసీ ప్రతినిధులు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.






