2 September, 2026 | 3:03 AM

ఓవర్ టూ ఢిల్లీ!

02-09-2026 | 01:38am

కాంగ్రెస్ హైకమాండ్‌తో మంతనాలు

  1. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ 
  2. మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డిలను ఏం చేద్దాం.. 
  3. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై గంట పాటు చర్చ 
  4. నేడు వేణుగోపాల్‌తో మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ సమావేశం 
  5. మంత్రి పదవి కోసం ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో స్పీకర్ ప్రసాద్‌కుమార్ భేటీ 
  6. ఇప్పటికే ఢిల్లీ చేరిన మంత్రులు ఉత్తమ్, తుమ్మల, వివేక్ 
  7. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్‌బాబు నేడు హస్తినకు..

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు(Telangana Congress Politics) హస్తినకు చేరాయి. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy), స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్(Gaddam Prasad Kumar), మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామితో పాటు మంత్రి కొండా సురేఖ(Konda Surekha) ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (పార్టీ సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్‌(KC Venugopal)తో  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాయంత్రం సమావేశం అయ్యారు.

దాదాపు గంటపాటు జరిగిన ఈ భేటీలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) 1,000 రోజుల పాలన, రాష్ట్రంలో ఇటీవలి రాజకీయ పరిణామాలు, అలాగే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha), ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి చిన్నారెడ్డి(Chinna Reddy)కి సంబంధించిన అంశాలపై ఇరువు రు నేతలు చర్చించారు. మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళన, నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించిన అవకాశాలపై కూడా ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు సమాచారం.

అయితే సీఎం రేవంత్ రెడ్డి తన అధికారిక కాన్వాయ్ లేకుండా, కేవలం తన వ్యక్తిగత సహాయకుడితో కలిసి వేణుగోపాల్ నివా సానికి వెళ్లినట్లు తెలిసింది. ఇక మంత్రివర్గ విస్తరణపై చర్చలు ముమ్మరం కా వడంతో  మంత్రి పదవులు ఆశిస్తున్న పలువురు ఎమ్మెల్యేలు.. మల్‌రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సుదర్శన్ రెడ్డి తదితరులు కూడా హస్తిన బాటపట్టారు. ఇదిలా ఉండగా, బుధవారం ఉదయం ఏఐసీసీ ఇన్‌చార్జీ, ప్రధాన కార్యదర్శి మీనాక్షి నట రాజన్,  టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమా ర్ గౌడ్.. 

కేసీ వేణుగోపాల్‌తో సమావేశం కానున్నారు. మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డిల అంశంపై అంశంపై ఈ ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ భేటీ అయ్యారు. రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఆయన కోరినట్లు సమాచారం. ఇక రాష్ట్ర పార్టీకి సంబంధించిన సంస్థాగత, రాజకీయ వ్యవహారాలపై తదుపరి అంశాలపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. 

మంత్రి సురేఖకు హస్తిన పిలుపు..

మంత్రి కొండా సురేఖ కూడా మంగళవా రం ఢిల్లీకి వెళ్లారు. మంత్రి సురేఖ.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అపాయింట్‌మెంట్ కోరడంతో అమెను ఢిల్లీకి పిలిపించారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత, మాజీ మంత్రి చిన్నారెడ్డి  చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌కు వివరించారు.

బుధవారం మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌తో చర్చించిన తర్వాత.. మంత్రి కొండా సురేఖకు అపాయింట్‌మెంట్ ఇస్తారనే ప్రచారం జరుగుతున్నది. సురేఖపై చర్యలు తీసుకోవాలని టీ పీసీసీ క్రమశిక్షణ కమిటీ పార్టీకి నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొన్నది. 

కేసీతో భేటీ కానున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. 

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా ఏఐసీసీ ప్రధాన కార్యద ర్శి కేసీ వేణుగోపాల్‌ను  కలిసే అవకాశం ఉందని సమాచారం. పార్టీ అధిష్ఠానం తన కు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందని, ఆ హామీని నాయకత్వానికి గుర్తు చేసేం దుకే తాను ఢిల్లీకి వచ్చానని రాజగోపాల్ రెడ్డి చెప్పినట్లు తెలిసింది. ఇబ్రాహీపట్నం ఎ మ్మెల్యే ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా ఢిల్లీకి చేరుకున్నారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటాలో మంత్రి పదవిని దక్కించుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోటాలో మంత్రి పదవీ ఆశిస్తున్నారు. అందుకు ఢిల్లీలో చురుగ్గా లాబీయింగ్ చేస్తుండగా, మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సమాచారం.