2 September, 2026 | 2:47 AM

ఖర్గే అవమానంపై చర్యలు తీసుకోవాలి

02-09-2026 | 01:36am

వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి 

రాహుల్‌పై ఎఫ్‌ఐఆర్ ఉపసంహరించుకోవాలి

రాష్ట్ర మహిళా కాంగ్రెస్ చీఫ్ ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): హల్ద్వానీలో శుద్ధీకరణ పేరుతో దళితులను అవమానించిన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్ చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే(AICC President Mallikarjun Kharge) కుర్చున్న చోటును శుద్ది చేస్తూ బీజేపీ నీచంగా వ్యవహారించిందని స్వర్ణ ఆరోపించారు. మంగళవారం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీభవన్ ఎదురుగా శాంతియుత నిరసన  చేపట్టారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే బహిరంగ సభలో కూర్చున్న ప్రదేశాన్ని బీజేపీ- నాయకులు గంగాజలంతో శుద్ధి చేయడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. ఒక దళితుడు కూర్చుంటే ఆ ప్రదేశం అపవిత్రం అవుతుందా?, ఇదేనా మీ హిందుత్వం.. మీ సంస్కారం? ఇది ఖర్గేను అవమానించడం కాదు, భారత రాజ్యాంగాన్ని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించడమేనని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ పై నమోదు చేసిన అక్రమ ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.