2 September, 2026 | 3:03 AM

152 కాదంటే 150 మీటర్లకైనా సరే.. తెలంగాణ కొత్త ప్రతిపాదన

02-09-2026 | 01:27am

తుమ్మిడిహట్టి ఎత్తుపై సీడబ్ల్యూసీ సమావేశం

  1. బరాజ్ ఎత్తుతో కలిగే ప్రయోజనాలు వివరించిన సర్కార్ 
  2. పాత ఒప్పందం మేరకే నిర్మించాలన్న మహారాష్ట్ర ప్రభుత్వం 
  3. ఏకాభిప్రాయం కోసం రెండు వారాల తర్వాత మరో భేటీ
  4. చర్చలు సానుకూలంగా జరిగాయి : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్  1 (విజయక్రాంతి): తుమ్మిడిహట్టి బరాజ్‌(Thummidihatti Barrage)పై ఢిల్లీలో కేంద్ర జల సంఘం(Central Water Commission) (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో తెలంగాణ(Telangana), మహారాష్ట్ర(Maharashtra) ఉన్నతాధి కారుల మధ్య మంగళవారం సుధీర్ఘ సమావేశం జరిగింది. సీడబ్ల్యూసీ ఛైర్మన్ అనుపమ్ ప్రసాద్(Anupam Prasad) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రాణహిత నదిపై తెలంగా ణ ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.

ముఖ్యంగా బరాజ్ ఎత్తు, సాంకేతిక అంశాలు(Technical aspects), అంతర్రాష్ట్ర సమస్యలపై ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ల(PowerPoint presentations)తో సమీక్షించారు. తుమ్మిడిహట్టి బరాజ్ ఎత్తును గతంలో మహారాష్ట్ర అంగీకరించిన 148 మీటర్లకు బదులుగా 152 మీటర్లకు పెంచేలా ఆ రాష్ట్రాన్ని ఒప్పించేందుకు తెలంగాణ అధికారులు తమ ప్రతిపాదనలను సమావేశంలో వివరించినట్లు తెలిసింది. బరాజ్ ఎత్తు పెంపుతో తెలంగాణకు కలిగే ప్రయోజనాలను అధికారులు మహారాష్ట్ర దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

అయితే, 152 మీటర్ల ఎత్తుపై మహారాష్ట్ర నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడలేదని తెలుస్తోంది. 152 మీటర్ల ప్రతిపాదనకు అంగీకారం కుదరని పరిస్థితుల్లో కనీసం 150 మీటర్ల ఎత్తుకైనా అంగీకరించాలని తెలంగాణ అధికారులు కోరినట్లు తెలిసింది. తెలంగాణ ప్రతిపాదనలను ఆ రాష్ట్ర అధికారులు స్వీకరించి, వాటిని పరిశీలించిన అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. బరాజ్ ఎత్తుపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు తదుపరి దశ లో రెండు వారాల తర్వాత మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

బరాజ్ ఎత్తుపై తదుపరి భేటీలో స్పష్టత

 తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ ఎత్తుపై తదుపరి సమావేశంలో మరింత స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీడబ్ల్యూసీ సమావే శంలో తుమ్మడిహట్టి ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు సానుకూలంగా జరిగాయని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కాగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు అందించే తుమ్మడిహెట్టి ప్రాజెక్టును పునరుద్దరించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులతోపాటు కేంద్ర జలశిక్తి శాఖ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లడంతో సీడబ్ల్యూసీ తాజా గా చర్చలకు శ్రీకారం చుట్టింది.