2 September, 2026 | 2:22 AM

సింగరేణి ప్రైవేటు చూపులు!

02-09-2026 | 01:15am
  1. గనుల ప్రైవేటీకరణకు కార్యాచరణ
  2. ముందే చెప్పిన ‘విజయక్రాంతి
  3. శాంతిఖనికి ‘సింగరేణి ఓం శాంతి’
  4. మరో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక
  5. వెస్ట్రన్ కోల్ ఫీల్ బాటలో సింగరేణి

మంచిర్యాల/బెల్లంపల్లి, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి) : కుక్కను చంపాలంటే.. ముందుగా పిచ్చిదని ప్రచారం చేయాలి.. సరిగ్గా సింగరేణి కంపెనీ(Singareni Company) అదే చేస్తోంది. వెస్ట్రన్ కోల్ ఫీల్‌(Western Coalfields)ను అనుసరిస్తూ నష్టాల సాకుచూపుతూ భూగర్భ గనుల(Underground mines)ను ప్రైవేట్‌కు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే సంస్థలో ఓపెన్ కాస్ట్‌లు(Open-cast mines) తప్పితే, భూగర్భ గనులకు చోటులేని పరిస్థితి ఎదురవుతోంది. సింగరేణికి మరో భూగర్భ గనులతల్లిగా పేరుగాంచిన బెల్లంపల్లి గనుల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతోంది.

‘మూలిగే నక్కపై తాటి పండు పడిన’ చందంగా చివరి పురాతన ఏకైక బొగ్గు గని శాంతిఖని చేజారిపోతోంది. ఆ గని నిర్వహణ నుంచి తప్పుకునేందుకు సింగరేణి పక్క చూపులు చూస్తోంది. అందుకు సింగరేణి తాజా విధానాలు నిజమని చాటుతున్నాయి. నష్టాల పేరిట శాంతిఖని గని ప్రైవేటీకరణకు టెండర్లు నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రైవేటు కంపెనీల నుంచి సింగరేణి దరఖాస్తులు(Singareni Applications) ఆహ్వానిస్తోంది. వెస్ట్రన్ కోల్ ఫీల్‌లో అమలులో ఉన్న గని అభివృద్ధి నిర్వహణ(Mine Development Management) (ఎండీవో) విధానంపై ఆసక్తి చూపుతోంది.

అక్కడ ప్రైవేట్ సంస్థతో బొగ్గు ఉత్పత్తి(Coal production) నిర్వహిస్తుంటారు. అదే పద్ధతిని సింగరేణిలో అమల్లోకి తేవాలని కంపెనీ చూ స్తోంది.  పైలెట్ ప్రాజెక్టుగా శాంతిఖని గనిని ఎంచుకుంది. ఇప్పటికే అండర్ గ్రౌండ్ గనుల నుంచి గ్యాసిపేకేషన్ కోసం బెల్లంపల్లిని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. శాంతిఖని గనిని ప్రైవేట్ శక్తులకు ఇచ్చేందుకు మరో పైలెట్ ప్రాజెక్టుకు మందమర్రి ఏరియాబెల్లంపల్లి వేదిక కానుంది.

శాంతిఖనికి సింగరేణి ఓంశాంతి...

సింగరేణి గనులను ప్రైవేటు పరం చేసేందుకు పైలెట్ ప్రాజెక్టుగా శాంతిఖని గనినే ఎంపిక చేసిందని తెలుస్తోంది. ఇది సక్సెస్ అయితే ప్రైవేటీకరణకు ద్వారాలు తెరుచుకున్నట్టే. ఇప్పటి వరకు బొగ్గు బ్లాకులను వేలం వేశారు. ఒకడుగు ముందుకేసి మరోరకంగా ప్రైవేటీకరణ చేస్తోంది. గనుల నిర్వహణను పూర్తిగా ప్రైవేట్‌కు అప్పగించేందుకు యోచిస్తున్నారు. ఇదే జరిగితే సింగరేణిలో క్రమంగా గనుల నిర్వహణ ప్రైవేటు సంస్థల పరం కానుంది. అందుకు కేంద్ర బొగ్గు శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు.

ఓ వైపు గ్యాసిపికేషన్, మరో వైపు భూగర్భ గనుల కాంట్రాక్టీకరణ పర్వం వేగవంతం చేస్తున్నారు. అటు గ్యాసిపికేషన్, ఇటు బొగ్గు ఉత్పత్తి లాభాల కోసం సిం గరేణి తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. సింగరేణిని ప్రగతి పథంలో నడిపించేందుకు యాజమాన్యం బహుముఖ విధానంతో పనిచేస్తోంది. అందుకోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఎట్లయితేనేమి.. ‘మన దొడ్లో ఈనితే చాలు అన్నట్టు’ సింగరేణి విధానంగా , లాభాలు సాధించడమే లక్ష్యంగా కనిపిస్తున్నదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రేక్షక పాత్రలో కార్మిక సంఘాలు

సింగరేణి పరిరక్షణకు గడ్డు పరిస్థితులు ముంచుకొస్తున్నాయి. ప్రభుత్వ రంగ సింగరే ణి సంస్థను లాభాల కోసం పల్లీలు, పిప్పర్ మెట్లలా అమ్మాలని చూస్తున్నారన్న ఆరోపణ లు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు కంపెనీలకు లాభాల కోసం లీజుకు ఇవ్వడానికి ఉత్సాహం కనబరుస్తున్నారు. దీనితో సింగరేణి ఉనికి ప్రమాదంలో పడి పోతుందని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో నీరో చక్రవర్తి లాగా కార్మిక సంఘాలు తమకేమీ పట్టనట్టుగా ఉండిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కార్మిక సంఘాలుగా సింగరేణి కంపెనీనీ కాపాడుకోవడం, గురుతరమైన బాధ్యత. యాజమాన్యం ప్రైవేటీకరణ విధానాలను అడ్డుకోవడం వారి ముందున్న కనీస బాధ్యత. కానీ ఆ పని కార్మిక సంఘాలు నిర్వహించడం లేదని కార్మికులు చర్చించుకుంటున్నారు. బొగ్గు గనుల పరిరక్షణ కోసం కార్మిక సంఘాలుగా ఏమి చేయాలో కూడా వారికి తెలియక పోవడం సిగ్గుచేటు. బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ ప్రైవేటీకరణ శాంతిఖనితో షురూ అయి అన్ని గనులకు భూతంలా ఆవరిస్తుంది.

ఈ చర్యలను ఆదిలోనే  గండి కొట్టాలి. ప్రైవేటు కంపెనీల చేతికి బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను అప్పగించడాన్ని సింగరేణి ఆబాలగోపాలం వ్యతిరేకించాలి. అందరూ ఒక్కటి గా ప్రతిఘటించాలి. శాంతిఖని పట్ల సింగరేణి తీరుపై ‘విజయక్రాంతి’ దినపత్రిక గతంలోనే ‘శాంతిఖనికి సింగరేణి ఓం శాంతి చెబుతుందని’ చెప్పింది. ఇప్పడూ అదే జరుగుతోంది.