వంగర రోడ్డు పనులు పూర్తి చేయాలి
నాట్లు వేసి మహిళల వినూత్న నిరసన
మంత్రి భూమి పూజ చేసి రెండేళ్లు పూర్తి అయిందన్న గ్రామస్తులు
భీమదేవరపల్లి, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి గ్రామ పంచాయతీ నుంచి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్వగ్రామమైన వంగర వరకు నిర్మించాల్సిన రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పలువురు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మంగళవారం ధర్నా చేసి మహిళలు రోడ్డుపై నాట్లు వేసి వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. రోడ్డు పనులకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) రెండేళ్ల క్రితం భూమి పూజ చేశారని పేర్కొన్నారు. అయినప్పటికీ అధికారుల కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వలన ఇప్పటివరకు కూడా రోడ్డు పనులు మొదలు కాకపోవడం శోచనీయమన్నారు.
రోడ్డు పనుల కోసం సర్పంచ్ మాచర్ల కుమారస్వామి మంత్రి పొన్నం ప్రభాకర్‌ను పలుమార్లు కలిసి విన్నవించుకున్న ప్రతిసారి స్వయంగా అధికారులకి, కాంట్రాక్టర్లకు ఫోన్ చేసి హెచ్చరించినప్పటికీ కూడా పనులు మొదలు కావడం లేదని గ్రామస్తులు పేర్కొన్నారు.
ఇది మండల కేంద్రంలో ముఖ్య రహదారి ఈ రోడ్డు మీద నుంచి మండల అధికారులు, అదేవిధంగా ఐదు మండలాలకు సంబంధించిన ప్రజలు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కి రిజిస్ట్రేషన్ కోసం వస్తూ ఉంటారు. ఎంతోమందికి ఉపయోగపడే రోడ్డుని త్వరిత గతిన పూర్తి చేయాలని పలువురు డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ శనిగరం ఐలయ్య వార్డు సభ్యులు పోలు సదానందం, పోలు అశోక్, బొల్లంపల్లి శ్యామ్, సాతురి విజయ, మార్పాటి లలిత, గ్రామ పెద్దలు గంగిరెడ్డి రాజమౌళి, శివసారపు రవీందర్, తాళ్లపల్లి సతీష్, మాచర్ల కర్ణాకర్, పోలు తిరుపతి, గాజుల కృష్ణ, మాచర్ల వెంకన్న, తాళ్లపల్లి సదానందం, కక్కర్ల వెంకన్న, శ్రీనివాస్ రెడ్డి, దాట్ల మధుకర్, గడల అజయ్, ఎర్ర రాజేష్, దాట్ల మొండయ్య తదితరులు పాల్గొన్నారు.






