ప్రజా దోపిడీ పాలన
- కాంగ్రెస్ విధానాలపై బీజేపీ ఎంపీ డా. కే లక్ష్మణ్ విమర్శలు
- అధికారంకోసం ఆరాటం.. అంతర్గత విభేదాలంటూ ఎద్దేవా
- తెలంగాణలో ప్రభుత్వ పాలన పడకేసిందని ఆరోపణలు
హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): కాంగ్రెస్‌ది ప్రజా పాలన కాదు.. దోపిడీ పాలన అని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ(Congress government) పాలన పడకేసిందని బీజేపీ ఎంపీ డా. కే లక్ష్మణ్(K. Laxman) విమర్శించారు. అధికారం కోసం ఆరాటం.. అంతర్గత కుమ్ము లాటలు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. లక్షల కోట్ల అప్పు చేస్తూ కనీసం ఉద్యోగులకు జీతాలు(Salaries for employees) ఇవ్వలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. మంగళవారం బీజే పీ రాష్ట్ర కార్యాలయంలో వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై ఎంపీ లక్ష్మణ్(MP Laxman) మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు.
ఢిల్లీకి మూటలు మోయడం తప్ప ప్రజలకు చేసిందేమీలేదని మండిపడ్డారు. ప్రజల ఆశలపై సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం పూర్తిగా నీళ్లు చల్లిందన్నారు. రాజ్యాంగాన్ని చేతి లో పట్టుకుని ఊరూరా తిరుగుతున్న రాహుల్‌గాంధీ.. కాంగ్రెస్ పాలిత రాష్టా ల్లో రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకలను అరెస్టుచేసి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్నారని తెలిపారు.
వెయ్యిరోజుల పాలన లో కాంగ్రెస్ నాయకుల అక్రమాలు(Irregularities) కప్పి పుచ్చడానికి తమపై భౌతిక దాడులు(Physical attacks) చేస్తూ, కాంగ్రెస్ దిగజారుడు రాజకీయా లకు పాల్పడుతున్నదని విమర్శించారు. శాంతియుత నిరసన చేస్తుంటే అరెస్ట్ చేసి ఎమర్జెన్సీ పాలనను తలపిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలియకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్ అమెరికా పర్యటనను కేంద్రం అడ్డుకున్నది అబద్ధాలు చెప్తున్నారని ఫైరయ్యారు.
రైతు భరోసా, అరకొర ఇచ్చి ఎగనామం పెట్టారని, నకిలీ విత్తనాలు, సకాలంలో యూరియా అందించక అభాసుపాలయ్యారన్నారు. వ్యవసాయ కూలీలకు 12 వేలు ఇస్తామని ఒక్క రూపాయి ఇవ్వలేదని తెలిపారు. ఉచిత వైద్యం.. పచ్చి బోగస్ అని తేలిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేక వైద్యం అందని పరిస్థితి ఉందన్నారు. చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించి పారిపోయారని ఎద్దేవా చేశారు.
విదేశాలు తిరిగే రాహుల్ గాంధీకి చిక్కడపల్లి లైబ్రరీ గుర్తురావట్లేదా? అని ప్రశ్నించారు. ఉస్మానియా వర్సిటీకు వెయ్యి కోట్లు ఇస్తానన్న సీఎం.. ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. వర్సిటీల్లో 50 శాతం పైగా ఖాళీలు ఉన్న భర్తీ చేయడంలేదన్నారు. మహిళలకు స్కూటీ, తులం బంగారం, షాది ముబారక్, కళ్యాణ లక్ష్మీ, సున్నా వడ్డీ అన్నీ శూన్యం అన్నారు.
హైడ్రా.. బుల్డోజర్ల రాజ్యం
పెద్దలకు రాజభవనాలు.. పేదలకు బుల్డోజర్లు అని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ప్రభుత్వమని ఆరోపించారు. హైద్రాబాద్ నగరం కాంక్రీటు జంగల్ అయిందని, కాంగ్రెస్ చేస్తున్న వాటికి రాజకీయ, న్యాయ పరమైన పోరాటాలు చేస్తామన్నారు. పేదల ఆస్తులు నిషేధిత జాబితాలో చేర్చితే.. వాళ్ళ బాధ వర్ణనాతీతమన్నారు.
బీసీలకు అభివృద్ధిని పట్టించుకోవడంలేదని, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ గాలికి వదిలేశారన్నారు. రేవంత్ ప్రభుత్వం దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నదని ఫైరయ్యారు. తాము తెలంగాణ ప్రజల కోసం పోరాడుతామని, వాళ్ళ వెంట ఉంటామని ఆయన స్పష్టం చేశారు.






