2 September, 2026 | 1:39 AM

గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి

01-09-2026 | 11:59pm

- మండపాల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

- జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

ఆదిలాబాద్,(విజయక్రాంతి): గణపతి నవరాత్రి ఉత్సవాలను(Ganpati Navratri celebrations) జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, గణేష్ మండపాల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్(District SP Akhil Mahajan) కోరారు. పట్టణంలోని తానిషా గార్డెన్ లో మంగళ వారం గణపతి మండప నిర్వహ కమిటీ సభ్యులు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు, కౌన్సిలర్లు, నాయకులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా గణపతి నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక స్థానం ఉందని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడుతూ, దానిని భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించాలన్నారు.

ఈ గణపతి విగ్రహాల ఏర్పాటు అనే పండుగ, ప్రశాంత వాతావరణంలో ప్రజలందరూ కలిసిమెలిసి నిర్వహించుకోవాలని, పోలీసు యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఆన్లైన్లో వచ్చే లింకు ద్వారా ప్రతి ఒక్క గణపతి మండపం రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేసుకోవాలని, దీని ద్వారా గణపతి నవరాత్రి ఉత్సవాలలో చేయాల్సిన బందోబస్తు, కేటాయించాల్సిన పోలీసు సిబ్బంది, నిమర్జనం ఏర్పాట్లు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఏర్పాట్లను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. గతంలో ఏర్పాటు చేసిన గణపతి మండపాలకు మాత్రమే అనుమతులు ఉన్నాయని, నూతనంగా ఏర్పాటు చేసే వారికి అనుమతులు లేవని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎఎస్పి రుత్విక్ సాయి కొట్టే, ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, స్థానిక కౌన్సిలర్లు, ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్ర వర్ధన్, పట్టణ సిఐలు బి సునీల్ కుమార్, కె నాగరాజు, బీడీ ప్రేమ్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్లు జి శ్రావణ్, సిహెచ్ రమేష్, కే నరేష్, ఎం ప్రసాద్, డి గురుస్వామి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, టి మురళి,ఎన్ చంద్రశేఖర్, ఎస్సైలు సిబ్బంది, హిందు ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షుడు బొంపల్లి హనుమన్లు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు, ఆదిలాబాద్ పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఏర్పాటు చేయనున్న గణపతి మండప నిర్వాహక కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.