చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
ములుగు (మహబూబాబాద్) మే 8 (విజయక్రాంతి): విద్యార్థులు చదువుతోపాటు చిన్నతనం నుండే క్రీడా పోటీల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలని, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క విద్యార్థులకు ఉద్బోధించారు.
శుక్రవారం రాత్రి జగ్గన్నపేట ఆశ్రమ బాలికల పాఠశాలలో నిర్మన్ ఆర్గనైజేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన రెజ్లింగ్ శిక్షణ కేంద్రాన్ని మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు, డి ఏఫ్ ఓ వికాస్ మీనా లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సెంటర్లో శిక్షణ పొందుతున్న క్రీడాకారుల ప్రతిభను పరిశీలించిన మంత్రి వారి క్రమశిక్షణ, పట్టుదలను చూసి ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ములుగు జిల్లా నుండి ఒలింపిక్ స్థాయికి ఎదిగి దేశానికి పేరు తీసుకురావాలని విద్యార్థులను ప్రోత్సహించారు. అదనపు కలెక్టర్ సిహెచ్ మహేందర్ జి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, స్థానిక ప్రజా ప్రతినిధులు, క్రీడాకారులు, కోచ్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






