4 August, 2026 | 1:49 AM

రిఫరల్ హాస్పిటల్‌గా నిజామాబాద్ జీజీహెచ్

04-08-2026 12:45 AM

త్వరలో సూపర్ స్పెషాలిటీ సర్వీసులు

అత్యాధునిక టెక్నాలజీతో ఎంఆర్‌ఐ సేవలు 

ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌ను ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే రిఫరల్ సెంటర్‌గా తీర్చిదిద్దుతున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఇక్కడ త్వరలోనే కార్డియాలజీ, న్యూరాల జీ, నెఫ్రాలజీ, యూరాలజీతో పాటు ఇతర సూపర్ స్పెషాలిటీ సేవలను దశలవారీగా ప్రారంభిస్తామని వెల్లడించారు. అత్యాధునిక సాంకేతి కతతో కూడిన ఎంఆర్‌ఐ యంత్రాన్ని కొనుగోలు చేస్తున్నామని, త్వరలోనేఈ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

సోమవారం సచివాలయంలో నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి సమీక్షా సమావేవం నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జనరల్ హాస్పిటల్, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీలు), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), సబ్ సెంటర్ల పనితీరు, ప్రజలకు అందుతున్న వైద్యసేవలు, మౌలిక వసతులు, వైద్య సిబ్బంది, అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు.

ప్రజాప్రతినిధులు చేసిన సూచనలు, హాస్పిటళ్ల అభివృద్ధి, పేషెంట్ల అవసరాలను ఒక్కొక్కటిగా తెలుసుకుని సంబంధిత అధికారులను తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిమ్స్, గాంధీ, ఉస్మానియా, నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లలో బెడ్ల కోసం ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలకు ఫోన్లు వస్తున్నాయని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. నిజామా బాద్ జిల్లాలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టిందని మంత్రి వెల్లడించారు.

ఈ నెలాఖరు నాటికి జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, రేడియాలజీ తదితర విభాగాల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకాలు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ దిశగా ప్రజాప్రతినిధులు కూడా తమ పరిధిలోని ప్రభుత్వ హాస్పిటళ్ల అభివృద్ధికి సహకరించాలని కోరారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌అలీ, పీ సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, పైడి రాకేష్‌రెడ్డి, రేకులపల్లి భూపతిరెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.