2 May, 2026 | 2:58 PM

నీట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి

02-05-2026 01:37 PM

పరీక్ష రాసే అభ్యర్థులు నిబంధనలను పాటించాలి.

ఇన్విజిలేటర్లు బాధ్యతతో విధులు నిర్వహించాలి.

ఇన్విజిలేటర్ల శిక్షణ తరగతుల్లో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

గద్వాల టౌన్ : నీట్ పరీక్షను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు ఇన్విజిలేటర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఈ నెల 3వ తేదీన నిర్వహించు నీట్ పరీక్షకు సంబంధించి శనివారం గద్వాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, బాలికోన్నత పాఠశాల కేంద్రాల్లో ఇన్విజిలేటర్లకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి మాట్లాడారు. జిల్లాలో నీట్ పరీక్షకు నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షను సజావుగా నిర్వహించేందుకు సిఎస్ లు, అబ్జర్వర్లు, తహసిల్దార్ లు, పోలీసు శాఖ అధికారులు, తదితరులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

ప్రతి గదిలో 24 మంది అభ్యర్థులకు ఇద్దరు ఇన్విజిలేటర్లు ఉంటారని, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. జాతీయస్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ పరీక్షలో  చిన్న తప్పిదం జరిగినా అభ్యర్థులందరూ ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. జిల్లాలో గతేడాది నీట్ పరీక్షను విజయవంతం చేసినట్లే ఈ ఏడాది కూడా పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఒక సారి పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులను తనిఖీ చేసి పంపించాక, పరీక్ష ముగిసేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో తిరిగి వారిని బయటకు పంపడానికి వీలు లేదన్నారు. హాల్ టికెట్ల ను జాగ్రత్తగా పరిశీలించి అభ్యర్థులను కేంద్రం లోపలికి అనుమతించాలన్నారు.

అభ్యర్థులు తమ హాల్ టికెట్ లోని నిబంధనలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా సిద్ధమై పరీక్ష రాసేందుకు రావాలన్నారు. అభ్యర్థులు షూస్ కూడా వేసుకోవడానికి అనుమతి లేనందున స్లిప్పర్స్ వేసుకురావాలన్నారు. పరీక్ష రాసేటప్పుడు ఓఎంఆర్ షీట్ లో కొంతమంది అభ్యర్థులు సెంటర్, ప్రశ్నాపత్రం కోడ్, తదితర అంశాలను తప్పుగా రాస్తుంటారని, వారికి ఇన్విజిలేటర్లు దిశా నిర్దేశం చేయాలని సూచించారు. ఆయా పరీక్షా కేంద్రాల వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేయడమే కాక అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైన అన్ని మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నీట్ సిటీ కోఆర్డినేటర్ దేవేందర్, తహసిల్దారులు నరేష్, నందిని, విజయ్ కుమార్, ఇతర అధికారులు, శిక్షకులు, తదితరులు పాల్గొన్నారు.