21 June, 2026 | 2:42 AM

మెడికల్ బోర్డుకు పోరాటమే శరణ్యం

21-06-2026 01:25 AM

టీఆర్‌ఎస్ జెండా పండుగలో కల్వకుంట్ల కవిత

జయశంకర్ భూపాలపల్లి/హనుమకొండ, జూన్ 20 (విజయక్రాంతి): బొగ్గు గని గర్భం లో చెమట చిందించే కార్మికుడి ఆరోగ్యాన్ని కాపాడే మెడికల్ బోర్డులే లేకుంటే పోరాటమే శరణ్యమని తెలంగాణ రక్షణ సేన టీఆర్‌ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. భూపాలపల్లి కాకతీయ ఖని 5 గని వద్ద శనివారం నిర్వహించిన గేట్ సమావేశంలో కార్మికులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. టీఆర్ ఎస్ జెండా పండుగలో పాల్గొని పార్టీ జెండా ఎగురవేశారు.

సింగరేణి మెడికల్ బోర్డుల నిర్వహణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి కార్యాలయంలోకి కవితను రాకుండా పోలీసులు అ డ్డుకున్నారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యానికి నెల రోజుల గడువు ఇస్తున్నామని   హెచ్చరించారు. గోదావరి పుష్కరాలను దృష్టి లో ఉంచుకుని కాళేశ్వరం దేవాలయ అభివృద్ధికి రూ.200 కోట్లు కేటాయించాలని డిమాం డ్ చేశారు. మహాముత్తారం, మహాదేవపూర్ మండలాల్లో అనేక గ్రామాలకు వంతెనలు అవసరమని, వర్షాలు కురిసిన ప్రతిసారీ రాకపోకలు నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయశక్తిగా టీఆర్‌ఎస్ వస్తుందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్, జనార్దన్ రావు, రాణి రుద్రమదేవిల మార్గమే తమకు దిక్సూచి అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణలో సినిమాలు తీసుకోవచ్చని, రాజకీయ జోక్యం చేసుకునే హక్కు ఆయనకు లేదన్నారు. ఏపీ నాయకులు తెలంగాణలో రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తే ఇక్కడి యువత ఊరుకోదని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.