21 June, 2026 | 1:36 AM

కుప్పకూలిన ఆలయ మండపం

21-06-2026 12:14 AM
  1. ఆరుగురు భక్తులు మృతి
  2. పలువురికి గాయాలు
  3. మహారాష్ట్రలోని యశ్వాడిలో ఘటన
  4. శిథిలాల కింద మరికొందరు.. కొనసాగుతున్న రెస్క్యూ 

ముంబై, జూన్ ౨౦: మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. యశ్వాడి గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న మారుతి (హనుమాన్) ఆలయ మండపం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదంలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. శిథిలాల కింద మరో ౪౦ మందికి పైగా భక్తులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు పోలీస్, అగ్నిమాపకశాఖ, రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

శనివారం కావడంతో ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. మధ్యాహ్నం ౩:౩౦ గంటల సమయంలో నిర్మాణ దశలో సభామండపం స్లాబ్ ఒక్కసారిగా కుప్పకూలింది. శిథిలాలు మీద పడి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీస్, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరకున్నారు.

శిథిలాల కింద చిక్కుకున్న ౨౫ మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. క్షతగాత్రులను అంబులెన్స్‌ల ద్వారా స్థానిక ఆస్పత్రులకు తరలించారు. అలాగే, ఆరు మృతదేహాలనూ వెలికితీశారు. శిథిలాల కింద చిక్కుకున్న మరో ౪౦ మందిని బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ కొనసాగిస్తున్నారు. ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.