బీఆర్‌ఎస్ నుంచి టీఆర్పీలోకి చేరికలు
ఆహ్వానించిన అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): నాగోలు బీఆర్‌ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా పనిచేస్తున్న పగడోజు సంగీత తన పదవికి రాజీనామా చేసి, తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో శనివారం ఆమె తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజ్యాధికార సాధనే లక్ష్యంగా టీఆర్పీ ముందుకు సాగుతోందని తెలిపారు.
ఈ లక్ష్యంతో పార్టీలో చేరుతున్న ప్రతి నాయకుడిని స్వాగతిస్తున్నామని అన్నారు. పగడోజు సంగీత మాట్లాడుతూ.. మల్లన్న నాయకత్వంపై విశ్వాసంతోనే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరినట్లు తెలిపారు. ప్రజల కోసం పనిచేసే ఈ వేదికలో భాగమవడం తనకు గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజ, నాయకురాలు మీనా, పావని, శ్రీనిధి పాల్గొన్నారు.






