దేవదూతలా మోదీ!
- చాలా అందగాడు.. బేరసారాల్లో నిక్కచ్చిగా ఉంటారు
- అమెరికాలో ప్రతి ఒక్కరూ భారత్‌ను ప్రేమిస్తారు
- భారత్‌పై దాడి జరిగితే మేం కాపాడుతాం
- భవిష్యత్‌లో భారత్‌లో పర్యటిస్తా : అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- మా నావికుల భద్రత మాకు ముఖ్యం
- పశ్చిమాసియాలో శాంతికి ట్రంప్ కృషి అభినందనలు : మోదీ
- ఫ్రాన్స్ జీ-7 సదస్సులో ద్వైపాక్షిక అంశాలపై చర్చలు
ప్యారిస్: భారత ప్రధాని నరేంద్రమోదీ దేవదూతలా, చాలా అందంగా కనిపిస్తారు.. కానీ బేరసారాల్లో చాలా నిక్కచ్చిగా ఉంటారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. తన దేశ ప్రయోజనాల విషయంలో ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత వెనుకడుగు వేయరని, రాజీపడని దృక్పథం కనబరుస్తారని ట్రంప్ కొనియాడారు. ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరిగిన జీ-7శిఖరాగ్ర దేశాల సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య గురువారం ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.
సమావేశం అనంతరం సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడారు. వ్యాపార ఒప్పందాలు, చర్చలు.. ఇలా ఏ విషయంలోనైనా వెనక్కి తగ్గకుండా మోదీ అత్యంత కఠనంగా ఉంటారని, ఆయన ఒక కిల్లర్’ అని కితాబునిచ్చారు. మోదీతో కలిసి పనిచేయడం తనకు ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తుందన్నారు. భారత్, అమెరికా దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయని స్పష్టం చేశా రు.
తమ ఇద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహమే దేశాల మధ్య బంధాన్ని నడిపిస్తోందని చెప్పారు. భవిష్యత్‌లో భారత్‌లో పర్యటిస్తానని ట్రంప్ తెలిపారు. అమెరికాలో ప్రతి ఒక్కరూ భారత్‌ను ప్రేమిస్తారని, భారత్‌పై ఎలాంటి దాడి జరిగినా అమెరికా అండగా నిలబడుతుందని ట్రంప్ స్పష్టం చేశారు.
ఇరు దేశాల మధ్య ఎలాంటి అధికారిక రక్షణ ఒప్పందం లేకపోయినా తమ సాయం అందుతుందని హామీ ఇచ్చారు. మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం భారత్‌కు వైట్‌హౌస్ రూపంలో ఒక గొప్ప స్నేహితుడు ఉంటాడని ట్రంప్ భరోసా ఇచ్చారు. పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
వాణిజ్య సంబంధాలు త్వరలోనే కొలిక్కి
అంతర్జాతీయ వేదికలపై భారత్ పాత్ర మరింత పెరగనుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో తాను భారత్‌లో పర్యటించినప్పుడు లభించిన ఘన స్వాగతాన్ని ట్రంప్ గుర్తు చేసుకున్నారు. అహ్మదాబాద్ స్టేడియంలో జరిగిన కార్యక్రమం తనకు ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు త్వరలోనే ఒక కొలిక్కి వస్తాయని ఇద్దరు నేతలు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు ట్రంప్ చేస్తున్న కృషిని ప్రధాని మోదీ అభినందించారు.
భారత నావికుల భద్రతకు భరోసా
భారతీయ నౌకా సిబ్బంది రక్షణ అంశాన్ని భారత ప్రధాని నరేంద్రమోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఒమన్ గల్ఫ్ ప్రాంతంలో జరిగిన అమెరికా దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన సంగతిని గుర్తు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది భారతీయులు సముద్ర రవాణా రంగంలో పని చేస్తున్నారని, వారి భద్రత తమకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని మోదీ స్పష్టం చేశారు.
ట్రంప్ స్పందిస్తూ నావికుల వృత్తి చాలా కష్టంతో కూడుకున్నదని తెలిపారు. వారి భద్రతకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు భవిష్యత్తులో ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని ట్రంప్ హామీ ఇచ్చారు. నావికుల మృతికి ఆయన సంతాపం ప్రకటించారు. అత్యధిక కాలం భారత ప్రధానిగా రికార్డు సృష్టించిన మోదీకి ట్రంప్ అభినందనలు తెలిపారు.






