19 May, 2026 | 2:52 AM

పారిశ్రామిక ప్రమాదాలపై ముగిసిన మాక్ ఎక్సర్‌సైజ్

19-05-2026 01:37 AM
  1. నిశితంగా పర్యవేక్షణ చేసిన అదనపు కలెక్టర్, అదనపు ఎస్పీ
  2. పాశమైలారంలో కొనసాగిన మాక్ డ్రిల్

పటాన్చెరు, మే 18 : పరిశ్రమలలో ప్రమాదాలు సంభవించిన సమయాలలో చేపట్టాల్సిన తక్షణ చర్యలు, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల విషయంలో సన్నద్ధతను తెలుసు కునేందుకు వీలుగా సోమవారం సంగారెడ్డి జిల్లాలోని బయోకాన్   లిమిటెడ్ పాశమైలారంలో చేపట్టిన మాక్ ఎక్సర్ సైజ్ విజయవంతంగా పూర్తయింది. అదనపు కలెక్టర్ పాండు, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి పర్యవేక్షణలో   నిర్వహించిన  ఈ మాక్ డ్రిల్ జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా సమాయత్తం అయి ఉందన్న విషయాన్ని ప్రయోగాత్మకంగా తెలిసింది. విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేలా మాక్ ఎక్సర్ సైజ్ ద్వారా చేపట్టిన సహాయక చర్యలు వాస్తవికతను తలపించేలా ఉన్నాయి.

అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో వ్యవహరిస్తూ, పారిశ్రామిక ప్రమాదాల  సమయాలలో ఏవిధంగా వ్యవహరించా లన్నది  ఆచరణాత్మక రూపంలో చేసి చూపించారు. పొలీస్, ఫైర్, రెవెన్యూ, హెల్త్, విద్యుత్, పరిశ్రమలు తదితర  అన్ని శాఖలు సమన్వయంతో ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తూ మాక్ ఎక్సర్ సైజ్ ను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పాండు మాట్లాడుతూ  అత్యవసర సమయాల్లో అప్రమత్తతతో నష్టాన్ని నివారించవచ్చని అన్నారు.

అన్ని శాఖల అధికారులు, కంపెనీ యాజమాన్యం, ఎన్ డీ ఆర్ ఎఫ్, ఉద్యోగుల సమన్వ యంతో మాక్ డ్రిల్ విజయవంతమైందన్నారు. అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి మాట్లాడుతూ, కంపెనీలో ఏర్పాటు చేసిన ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపారు. ఏ కంపెనీలోనైనా ప్రమాదం సంభవించిన వెంటనే సంబంధిత అధికారులు పోలీసు శాఖకు సమాచారం అందజేయాలని సూచించారు. అలాగే, కంపెనీ యాజమాన్యం తక్షణ చర్యలు చేపట్టడంతో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖలకు వెంటనే సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రాజేందర్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి నాగేశ్వరరావు, పోలీస్ వైద్య ఆరోగ్య, పరిశ్రమలు రెవిన్యూ, విద్యుత్ శాఖల అధికారులు, బయోకాన్ కంపెనీ ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు.