30 July, 2026 | 2:03 AM

నిధులున్నా సాగని ‘నిర్మాణం’

30-07-2026 01:14 AM
  1. నత్తనడకన ఘట్కేసర్ రోడ్డు విస్తరణ పనులు
  2. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం
  3. పట్టించుకోని అధికారులు

ఘట్కేసర్, జూలై 29 (విజయక్రాంతి) : పట్టణాభివృద్ధికి, నిత్యం పెరిగిపోతున్న వాహనాల రాకపోకలకు అనుగుణంగా మౌలిక వసతులు మెరుగుపరచాల్సిన పనులు పడకేసాయి. ఘట్కేసర్ పట్టణ పరిధిలోని బైపాస్ రోడ్డు (శివారెడ్డిగూడ) చౌరస్తా నుండి మాధవ రెడ్డి బ్రిడ్జి వరకు 2.5 కిలోమీటర్ల పొడవు 100 ఫీట్ల రోడ్డు విస్తరణతో పాటు సెంట్రల్ లైటింగ్, డివైడర్ నిర్మాణ పనులకు ప్రభుత్వం దాదాపు రూ. 30 కోట్ల భారీ నిధులను మంజూరు చేసినప్పటికీ, పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి.

పనుల్లో ఆలస్యం.. ప్రయాణికులకు తీవ్ర నరకం

ఈప్రధాన రహదారిపై ప్రతినిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఐటీ కారిడార్లకు వెళ్లే ఉద్యోగులు, స్థానిక వ్యాపారులు, విద్యార్థులు ఈ మార్గం పైనే ఆధారపడి ఉన్నారు. అయితే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమై నెలలు గడుస్తున్నా పనుల్లో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు.

నుల జరగనందున  దుమ్ముతో వాహనదారులు, రోడ్డు పక్కన ఉన్న వ్యాపారులు శ్వాసకోశ సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సరైన హెచ్చరిక బోర్డులు, రాత్రి వేళల్లో వెలుగులు లేకపోవడంతో చిన్నపాటి ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రూ. 30 కోట్లు ఏమైనట్టు..?

రూ. 30 కోట్ల భారీ బడ్జెట్ నిధులు విడుదలైనప్పటికీ, పనుల్లో వేగం లేకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా? లేక పర్యవేక్షించాల్సిన శాఖల అధికారుల పట్టింపులేమియా? అని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

తక్షణమే స్పందించాలి!

రోడ్డు విస్తరణ పనులతో ఘట్ కేసర్ పట్టణం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశపడ్డ ప్రజలకు నిరాశే ఎదురయింది. ఇప్పటికైనా సంబంధిత  ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి కాంట్రాక్ట్ సంస్థపై ఒత్తిడి తెచ్చి పనులను వేగవంతం చేయాలని,  డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రజలు వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. కోట్ల నిధులు కాగితాలకే పరిమితం కాకుండా, త్వరలోనే ఈ రహదారి సుందరీకరణ పూర్తికావాలని ఘట్కేసర్ ప్రజలు కోరుకుంటున్నారు.