28 May, 2026 | 11:54 AM

విభేదాలు పక్కన పెడదాం సంతోషంగా జీవిద్దాం

28-05-2026 10:43 AM

బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక  

 ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ (విజయ క్రాంతి) : ఏమైనా చిన్న చిన్న విభేదాలు ఉంటే వాటిని పక్కన పెట్టి అందరం ఐక్యంగా ఉండి సంతోషంగా జీవిద్దామని  ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  గురువారం బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పర్వదినాన్ని పురస్కరించుకొని మహబూబ్‌నగర్ నగరంలోని మయూరి పార్కు వద్ద గల హైలే హద్దీస్ ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ప్రార్థనల అనంతరం ఎమ్మెల్యే ముస్లిం సోదరులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పర్వదినం త్యాగం, నిస్వార్థత, దానధర్మాల ప్రతీక అని ఆయన పేర్కొన్నారు.

సమాజంలో పరస్పర ప్రేమ, సౌహార్దం, సహనం పెంపొందించుకోవాలని ఆయన సూచించారు. సమాజంలో మత భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి జీవించడం ఎంతో అవసరమని తెలిపారు. ప్రతి పండుగ మనలోని మానవత్వాన్ని, సేవాభావాన్ని పెంచేందుకు దోహదపడుతుందని చెప్పారు. ముఖ్యంగా బక్రీద్ పర్వదినం మనకు త్యాగం, పరస్పర సహకారం, పేదలకు సహాయం చేయడం వంటి విలువలను గుర్తు చేస్తుందని ఆయన అన్నారు. 

మహబూబ్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యంగా విద్యా రంగంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, డిజిటల్ లెర్నింగ్ సెంటర్ల స్థాపన, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాల కల్పన వంటి చర్యలతో విద్యా రంగాన్ని బలోపేతం చేస్తున్నామని వివరించారు. సమాజంలో శాంతి, సామరస్య వాతావరణం నెలకొనాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూసుఫ్ బిన్ బదర్, మహ్మద్ సలీమ్, జియౌద్దీన్ సైఫ్, నేమతుల్లా సాబ్, జాబేర్ బిన్ సయీద్, ఇస్సా అమోధి తదితరులు పాల్గొన్నారు .