25 February, 2026 | 4:46 AM

బీజేపీ అధిష్ఠానాన్ని వెర్రిపుష్పాలను చేస్తున్న ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

25-02-2026 01:31 AM

కామారెడ్డి, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): నీచ రాజకీయాలు చేయడం వెంకటరమణారెడ్డికి అలవాటేనని టిపిసిసి ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్ల రాజు అన్నారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కామారెడ్డిలో ‘వెంకటరమణ’ డ్రామాలు నియోజక వర్గ ప్రజలు గమనిస్తున్నారన్నారు.

అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ‘దాడి’ జరిగిందని అబద్ధాలు నాటకాలు ఆడుతున్నాడు అన్నారు. రాజకీయాల్లో గెలవగానే సరిపోదు, ప్రజలకు జవాబుదారీగా ఉండాల న్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తీరు చూస్తుంటే దొంగే దొంగ అన్నట్టు అన్న చందంగా  ఉందన్నారు.కాలేజీ భూముల కబ్జా భాగోతం ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో, తనపై దాడి జరిగిందంటూ కొత్త నాటకానికి తెరలేపారు అన్నారు.

సొంత బంధువుపైనే దాడి.. ఇదా మీ రాజకీయం నిజానికి వెంకటరమణారెడ్డిపై ఎవరూ దాడి చేయలేదు. వాస్తవం ఏమిటంటే, ఆయనకు అత్యంత సమీప బంధువు, నిత్యం టచ్లో ఉండే వ్యక్తిని చర్చల పేరుతో పిలిపించి, స్వయంగా ఎమ్మెల్యే అనుచరులే ఆయనపై దాడి చేసి కారును ధ్వంసం చేశారు. ఈ నిజాన్ని దాచిపెట్టి, రాష్ట్ర నాయకత్వాన్ని తప్పుదోవ పట్టిస్తూ ‘వెర్రిపుష్పాలను’ చేస్తున్నారు. దొంగలు.. దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్టు వారి మాటలు ఉన్నాయన్నారు. 

పొద్దున లేస్తే ముస్లింలు, రోహింగ్యాలు, గుళ్ళు, దేవుళ్ళు అంటూ మత రాజకీయాలు చేయడం తప్ప, నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడితే నోరు పడిపోతుందా ప్రజానాయకుడిపై విమర్శలా?: ఓడినా గెలిచినా, కరోనా కష్టకాలంలోనూ, వరదల్లోనూ ప్రజల వెంటే ఉంటూ అండగా నిలిచే మా నాయకుడిని విమర్శించే స్థాయి మీకు ఉందా? అని ప్రశ్నించారు.

ఆయనకు పదవులతో సంబంధం లేదు, ప్రజల గుండె ల్లో చోటు ఉంది. మీ క్యాంప్ కార్యాలయం వద్దకు మహేందర్ రెడ్డి తప్ప, కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండో వ్యక్తి వచ్చాడని నిరూపించగలరా.. నిరూపిస్తే రాజకీయ సన్యాసా నికి సిద్ధం అని అన్నారు.  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్ కుమార్, నియోజకవర్గ యువజన నాయకుడు గుడుగుల శ్రీనివాస్ పాల్గొన్నారు.