15 June, 2026 | 1:31 AM

సత్తుపల్లి క్రిస్టియన్ భవన్, బైపాస్ రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రాగమయి

15-06-2026 12:20 AM

సత్తుపల్లి, జూన్ 14 (విజయ క్రాంతి): సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా సత్తుపల్లి పట్టణంలోని క్రిస్టియన్ భవన్ పనులను  పరిశీలించారు.  సంబంధిత అధికారులతో మాట్లాడి తగిన సూచనలు చేశారు. అనంతరం పట్టణంలోని బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రహదారి నిర్మాణాన్ని వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.