ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది
ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త ప్రొ.జి.హరగోపాల్
ముషీరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): దేశంలో ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, న్యాయవ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందని ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త, విద్యావేత్త ప్రొ.జి.హరగోపాల్ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ ప్రమాదంలో ఉన్నాయని ప్రశ్నించే వారిపై భయానక వాతావరణం సృష్టిస్తున్నారని అన్నారు.
ఈ మేరకు ఆదివారం రాత్రి బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో భారత ప్రజా న్యాయవాదుల సంఘం సహాయ కార్యదర్శి డి.సురేష్ కుమార్ అధ్యక్షతన ’ఆపరేషన్ కగార్ ముగిసింది, కానీ బాధితుల న్యాయపోరాటం మిగిలే ఉంది’ అనే అంశంపై ప్రజా నివేదన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొ.హరగోపాల్ మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ కారణంగా మానవ హక్కులు, రాజ్యాంగం, న్యాయవ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయని ఆరోపించారు.
శాంతి చర్చలు నిర్వహించాలని కోరిన వారిపై నిర్బంధ చర్యలు చేపట్టి, వారిని ‘ఆర్బన్ నక్సల్స్’గా ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు భయం నుంచి బయటపడితే వ్యవస్థలో గణనీయమైన మార్పులు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. తెలంగాణలో పౌరహక్కుల ఉద్యమాల గురించి మాట్లాడే పరిస్థితి ఉన్నప్పటికీ, దేశ వ్యాప్తంగా అలాంటి పరిస్థితి లేదన్నారు. ప్రజలకు వ్యవస్థపై విశ్వాసం తగ్గిపోవడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ సభలో వీక్షణం సంపాదకుడు వేణుగోపాల్, న్యాయవాదులు జవారి, రమేష్, రజిత దితరులు పాల్గొన్నారు.






