బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల
కేసీఆర్ పదేళ్లలో ఏనాడు పూర్తి చేయలే.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం హనుమకొండలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రాష్ట్రస్థాయి రైతుమేళా(Rythu Mela) నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao), కొండా సురేఖ హాజరయ్యారు. రైతుమేళా వ్యవసాయ పరికరాలు, ఉత్పత్తులను మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ... బీఆర్ఎస్ చేయని పనులను సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్లలోనే చేశారని సూచించారు. మొదటి ఏడాదిలోనే రైతులకు రూ. 2 లక్షల చొప్పున రుణమాఫీ చేశారని తెలిపారు. 25 లక్షల మంది రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేశారని తెలిపారు.
రైతుల ఖాతాల్లో రూ. 21 వేల కోట్లను కాంగ్రెస్ సర్కార్ జమ చేసిందని తెలిపారు. రూ. లక్ష రుణమాఫీని కేసీఆర్ పదేళ్లలో ఏనాడు పూర్తి చేయలేదని ఆరోపించారు. రుణమాఫీకి బీఆర్ఎస్ ఐదేళ్ల సమయం తీసుకోవడంతో వాళ్లు ఇచ్చింది వడ్డీలకు కూడా సరిపోలేదన్నారు. ఒక్క రైతుబంధు ఇచ్చి మిగతా పథకాలన్నింటిని నిలిపివేశారని సూచించారు. రైతుల కోసం రూ. లక్ష కోట్లు ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. అహంకార పూరిత బీఆర్ఎష్ కు మళ్లీ అధికారం ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేరని ఆయన వివరించారు. ఇవాళ రైతులకు అప్పులు తక్కువున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు ఉన్నదని తెలిపారు.






