17 July, 2026 | 12:24 AM

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

17-07-2026 12:01 AM

జగన్నాథుడికి మంత్రి శ్రీదర్‌బాబు పూజలు

అబిడ్స్ ఇస్కాన్ ఆధ్వర్యంలో రథయాత్ర 

ఎన్టీఆర్ స్టేడియం నుంచి అబిడ్స్ వరకు నిర్వహణ 

ముషీరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో గడపాలని పూరి జగన్నాథుడిని కోరుకున్నట్లు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. గురువారం హైరాబాద్ ఇందిరాపార్కు ఎన్టీఆర్ స్టేడియం నుంచి అబిడ్స్ ఇస్కాన్ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పూరి జగన్నాథ రథయాత్రను మంత్రి ప్రారంభించారు. అంతకు ముందు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్బంగా జగన్నాధ రథ యాత్రను గుమ్మడి కాయకొట్టి మంత్రి శ్రీధర్ బాబు ప్రారంబించి రోడ్డును చీపుర్లతో ఊడ్చి శుభ్రం చేసి తాడుతో రథాన్ని లాగి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం జరిగిన పూరి రథయాత్రలో పాల్గొనడం తన అదృష్టంగా బావిస్తున్నానని ఆ యన పేర్కొన్నారు.

గత 47 సంవత్సరాలుగా అబిడ్స్ ఇస్కాన్ దేవాలయం కమిటీ నిర్వహించడం అభినందనీ యమాన్నారు. పూరి కి వెళ్లలేని భక్తులకు జగన్నాధుడి రథయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజ లు దర్శనం కల్పిస్తున్నారని అన్నారు. బందుమిత్రులతో భగవంతున్ని ద్యానిస్తూ హరే కృష్ణ హరే రామ, కృష్ణ కృష్ణ హరే హరే అంటూస్మరిస్తూ రాష్ట్ర ప్రజల సంక్షే మం కోసం పూజలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. 

ఎన్టిఆర్ స్టేడియం నుంచి ప్రారంభమైన రథయాత్ర ఇందిరా పార్కు చౌరస్తా, అశోక్ నగర్ చౌరస్తా, గాంధీనగర్, ఆర్టీసి క్రాస్ రోడ్, చిక్కడపల్లి మీదుగా అబిడ్స్ వరకు రథయాత్ర కొనసాగింది. రథయాత్ర ముందు రంగురంగుల ముగ్గులు వేసి భక్తులు హరే రామ హరే కృష్ణ నినాదాలు, నృత్యాలు చేయడంతో ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాలు హరే రామ, హరే కృష్ణ నినాదాలతో మార్మోగింది.