క్వార్టర్ ఫైనల్లో సింధు
- హాన్ యూపై అద్భుత విజయం
- జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్
టోక్యో, జూలై 16 : జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన మహిళల సిం గిల్స్ ప్రీక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాం కర్ హాన్ యూ(చైనా)పై సింధు అద్భుత విజయాన్ని అందుకుంది. సింధు 21--16, 21--14 స్కోరుతో వరుస గేమ్‌లలో గెలిచింది. ప్రస్తుతం పదో ర్యాంక్‌లో ఉన్న సిం ధు కేవలం 35 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ము గించింది. తొలి గేమ్ ఆరంభంలో కాస్త వెనుకబడినప్పటికీ, మళ్లీ పుంజుకుంది.
ఆ తర్వాత వరుస పాయింట్లు సాధిస్తూ ఆధిపత్యం చెలాయించింది. తర్వాత రెండో గేమ్‌లో అయితే ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా చెలరేగిపోయింది. మ్యాచ్‌ను పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకుని అలవోకగా గెలుపొందింది. ఈ విజయంతో హాన్ యూపై సింధు తన ముఖాముఖి రికార్డును 8--1కు పెంచుకుంది. ఈ సీజన్‌లో సింధు సాధించిన అత్యుత్తమ విజయాల్లో ఇదొకటి.
క్వార్టర్ ఫైనల్లో సింధు జపాన్‌కు చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమీ ఒకుహరాతో తలపడనుంది. టాప్ క్రీడాకారిణి ఆన్ సె-యంగ్(దక్షిణ కొరియా) గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలగడంతో ఒకుహరాకు వాకోవర్ లభించింది. ప్రస్తుతం ఈ టోర్నీ లో సింధు మాత్రమే టైటిల్ రేసులో నిలిచింది. పురుషుల సింగిల్స్, డబుల్స్, మిక్సిడ్ డబుల్స్, మహిళల డబుల్స్‌లో భారత్ పోరా టం ఇప్పటికే ముగిసింది.






