17 July, 2026 | 12:22 AM

మట్టపల్లి పర్యాటకాభివృద్ధికి 13 కోట్లు

17-07-2026 12:22 AM

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

మంత్రి జూపల్లితో చర్చించి నిధుల మంజూరు చేయించిన మంత్రి ఉత్తమ్

భక్తులు, స్థానికుల హర్షం   

సూర్యాపేట, జూలై 16 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని చారిత్రక, పర్యాటక ప్రాధాన్యం కలిగిన మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సన్నిధిలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవాలయ పరిసరాల్లో పర్యాటక సౌకర్యాల కల్పనతోపాటు బోటింగ్ కార్యకలాపాలకు రూ.13 కోట్ల పరిపాలనా అనుమతిని ప్రభుత్వం మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది.

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ నిధులు మంజూరు చేయించారు. మట్టపల్లి క్షేత్రాన్ని రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సంబంధిత శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పలుమార్లు చర్చించి, ప్రతిపాదనకు ఆమోదం లభించేలా కృషి చేసినట్టు తెలిసింది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు క్షేత్రాన్ని పరిశీలించి, అభివృద్ధి పనులకు రూ.13 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వాటిని పరిశీలించి పరిపాలనా అనుమతి మంజూరు చేసింది.

మరింత అభివృద్ధికి దోహదం

ప్రభుత్వం మంజూరు చేసిన ఈ నిధులతో మట్టపల్లి ఆలయ పరిసరాల్లో ఆధునిక పర్యాటక వసతులు, సందర్శకులకు అవసరమైన సౌకర్యాలు, బోటింగ్ కార్యకలాపాల అభివృద్ధి, పర్యాటక మౌలిక వసతుల విస్తరణ చేపట్టనున్నారు. దీనివల్ల రాష్ట్ర నలుమూలలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు హుజూర్‌నగర్ ప్రాంతంలో పర్యాటక రంగానికి కొత్త ఊపు రానుందని అధికారులు భావిస్తున్నారు.

ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యం కల్పిస్తూ ఆధ్యాత్మిక, పర్యాటక, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి ఉత్తమ్‌కు మార్‌రెడ్డి పేర్కొన్నారు. నిధుల మంజూరు పట్ల స్థానికులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.