రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యం
సీఈటీఏతో ద్వైపాక్షిక వాణిజ్యానికి కొత్త అవకాశాలు
తెలంగాణలో అంతర్జాతీయస్థాయి సదుపాయాలు
యూకే ప్రతినిధుల భేటీలో మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): భారత్- కింగ్‌డమ్(యూకే)ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ) ద్వారా తెలంగాణకు గరిష్ఠ ప్రయోజనం చేకూరేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఈ ఒప్పందంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యం మరింత వేగంగా వృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
యూకే డిప్యూటీ ట్రేడ్ కమిషనర్ (దక్షిణాసియా) చంద్రు కే.అయ్యర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబుతో సమావేశమైంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఈటీఏ ఒప్పందం వల్ల ఇరుదేశాల మధ్య సుమారు రూ.3.56 లక్షల కోట్ల వాణిజ్యానికి అవకాశాలు ఏర్పడతాయన్నారు. తెలంగాణలో పారిశ్రామిక తయారీ, లైఫ్ సైన్సెస్, ఏవియేషన్, డిఫెన్స్, ఐటీ, సెమీకండక్టర్లు, చిప్ డిజైన్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని మంత్రి వివరించారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, సఫ్రాన్ ఏవియేషన్ వంటి సంస్థలు ఇప్పటికే పరిశ్రమలను ఏర్పాటు చేశాయని గుర్తు చేశారు.
ప్రస్తుతం తెలంగాణ నుంచి యూకే రూ.3,553 కోట్ల విలువైన ఎగుమతులు జరుగుతున్నాయని, సీఈటీఏ ప్రయోజనాలతో ఈ ఎగుమతులను మరింత పెంచుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశ ఫార్మా ఉత్పత్తుల్లో 40 శాతం తెలంగాణ నుంచే వస్తున్నాయని, వ్యాక్సిన్ ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 30 శాతం ఉందని తెలిపారు. బుధవారం అమల్లోకి వచ్చిన సీఈటీఏ ఒప్పందం వల్ల భారత్ నుంచి ఎగుమతి అయ్యే 99 శాతం పారిశ్రామిక ఉత్పత్తులపై యూకే సుంకాలను తొలగించిందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయలను వినియోగించుకోవాలని కోరారు.
మంత్రికి యూకే పర్యటనకు ఆహ్వానం
హైదరాబాద్‌లో ఫార్చ్యూన్ 500 కంపెనీలతో పాటు పలు ప్రముఖ సంస్థలు 350 గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లను (జీసీసీలు) ఏర్పాటు చేశాయని మంత్రి తెలిపారు. యూకేకు ఎగుమతి చేయగలిగే ఉత్పత్తుల తయారీపై స్థానిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించాలని పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్యకు మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు.
యూకే నుంచి భారత్‌కు వచ్చే మేయర్ల బృందం హైదరాబాద్‌ను కూడా సందర్శించేలా చూడాలని చంద్రు కే.అయ్యర్‌ను కోరారు. అలాగే అధికారులు, ప్రతినిధులతో కలిసి యూకేను సందర్శించి అక్కడి పారిశ్రామిక, వాణిజ్య ఎకోసిస్టంను పరిశీలించాలని శ్రీధర్‌బాబును చంద్రు కే అయ్యర్ ఆహ్వానించారు. సమావేశంలో కే ప్రతినిధులు సిద్ధార్థ్ విశ్వనాథన్, నళిని రఘురామన్, ప్రవీణ్ పద్మనాభన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య పాల్గొన్నారు.






