16 July, 2026 | 6:43 PM

రాజన్న ఆలయ కళ్యాణకట్టలో ఆలయ ఈవో రమాదేవి ఆకస్మిక తనిఖీలు

16-07-2026 06:22 PM

భక్తుల నుంచి అదనపు డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవు

వేములవాడ: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కింది కళ్యాణకట్టలో ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో)ఎల్ రమాదేవి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో కళ్యాణకట్టలో భక్తుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో పాటు, కొంతమంది భక్తులు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆమె ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు.

తనిఖీల సందర్భంగా ఈవో కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకునేందుకు వచ్చిన భక్తులతో నేరుగా మాట్లాడి, వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా, ఎవరైనా అదనపు డబ్బులు డిమాండ్ చేస్తున్నారా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. భక్తుల నుంచి వచ్చిన అభిప్రాయాలను నమోదు చేసుకున్నారు. అనంతరం అక్కడ విధులు నిర్వహిస్తున్న నాయి బ్రాహ్మణులను ఒక్కొక్కరిని వీడియో రికార్డింగ్ ద్వారా ఇంటర్వ్యూ చేసి వారి పూర్తి వివరాలు సేకరించారు. వారికి వేతనాలు సక్రమంగా అందుతున్నాయా, కాంట్రాక్టర్  ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు.

కళ్యాణకట్ట నిర్వహణ కాంట్రాక్టర్‌తో మాట్లాడిన ఈవో, అక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా యూనిఫాం,  గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే కార్మికులకు సకాలంలో జీతాలు చెల్లిస్తున్నారా అనే విషయాన్ని కూడా అడిగి తెలుసుకున్నారు. భక్తుల నుంచి తలనీలాల కోసం అదనపు డబ్బులు వసూలు చేయడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఈవో స్పష్టం చేశారు. ఎవరైనా భక్తుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు నిర్ధారణ అయితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైతే కాంట్రాక్టును రద్దు చేసి బ్లాక్‌లిస్ట్‌లో చేర్చుతామని హెచ్చరించారు.

భక్తులకు అవగాహన కల్పించేందుకు కళ్యాణకట్ట గోడలపై "తలనీలాల టికెట్ ధర రూ.50 మాత్రమే", "నాయి బ్రాహ్మణులకు ఎలాంటి అదనపు డబ్బులు చెల్లించవద్దు", "అదనపు డబ్బులు తీసుకోవడం శిక్షార్హమైన నేరం" అనే సమాచారాన్ని స్పష్టంగా ప్రదర్శించే బోర్డులు ఏర్పాటు చేయించారు. అదేవిధంగా భక్తులకు నిరంతరం అవగాహన కల్పించే విధంగా మైక్ ద్వారా ప్రకటనలు చేయించే ఏర్పాట్లు కూడా చేశారు.

ఈ సందర్భంగా కళ్యాణకట్టలోని రెండు విభాగాలను పూర్తిగా పరిశీలించిన ఈవో, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారదర్శకంగా సేవలు అందించాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. కళ్యాణకట్టలో నగదు వసూళ్లపై నిరంతర నిఘా ఉంచేందుకు ప్రత్యేకంగా ఇద్దరు సిబ్బందిని నియమించి, భక్తుల నుంచి ఎవరైనా అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారా అనే అంశాన్ని పర్యవేక్షించాలని ఆదేశించారు.

అదేవిధంగా కళ్యాణకట్ట ప్రాంగణమంతా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండేలా చర్యలు తీసుకోవాలని, కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఫిర్యాదులను పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ తనిఖీల అనంతరం దేవస్థానం డీఈవో నవీన్ కుమార్, ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, నరేందర్, శివసాయి, ఏఈ రామకృష్ణారావు, స్థానిక పోలీసు సిబ్బంది తదితరులు ఈవోతో కలిసి కళ్యాణకట్ట నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.