మంత్రి పొన్నం.. యాక్టింగ్ బంద్ చెయ్
- ధాన్యం కొనుగోళ్లలో రైతులకు సున్నం పెడుతున్న మంత్రి పొన్నం
- మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ ఫైర్
హుస్నాబాద్, మే 18(విజయక్రాంతి) : హుస్నాబాద్ ప్రజలు మార్పు కోరుకుని గెలిపిస్తే& ఆ మార్పు రైతుల పంటలు కొనకుండా ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికా? అంటూ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాక్ప హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామ పరిధిలోని ఓ పారాబాయిల్ రైస్ మిల్లుతో పాటు సమీపంలోని పలు మిల్లులను సందర్శించిన ఆయన, ధాన్యం నిల్వలు, కొనుగోళ్ల పరిస్థితిపై ఆరా తీశారు.
అనంతరం మాట్లాడిన సతీష్ కుమార్& రైతు ప్రభుత్వం అంటూ ప్రతిరోజూ మైక్ ముందు మాటలు చెప్పడం సులువు, కానీ రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయించడమే అసలు పాలన అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో వడ్లు, మక్కలు, పొద్దుతిరుగుడు పంటలు కొనుగోలు కాక రైతులు ఆందోళనలో ఉంటే మంత్రి పొన్నం మాత్రం పర్యటనలు, ఫోటో సెషన్లు, ప్రచార హడావుడికే పరిమితమయ్యారని మండిపడ్డారు.
కారు కాన్వాయ్ తిరుగుతోంది.. కెమెరాలు క్లిక్ మంటున్నాయి, కానీ మిల్లుల్లో ధాన్యం కుప్పలు మాత్రం అలాగే పడి ఉన్నాయి అంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు ధాన్యం కొనుగోళ్లపై కనీసం జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించకపోవడం మంత్రి వైఫల్యానికి నిదర్శనమన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు తమ పంటను అమ్ముకునేందుకు ఎప్పుడూ ఇబ్బందులు పడలేదని, రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసిన చరిత్ర బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు.
ప్రస్తుతం గతేడాది స్టాక్ ఇంకా మిల్లుల్లో ఉండిపోవడంతో కొత్త ధాన్యం కొనుగోలు ఆగిపోయిందని తెలిపారు. రోహిణి కార్తె సమీపిస్తోందని, రైతులు వానాకాలం సాగుకు సిద్ధమవుతుంటే ఇంకా పంట అమ్ముకోలేక మిల్లుల చుట్టూ తిరగడం బాధాకరమన్నారు. ఇకనైనా యాక్టింగ్ మానేసి యాక్షన్లోకి రావాలి. సోషల్ మీడియా పోస్టులు కాదు& రైతు గోదాములు ఖాళీ కావాలి. ప్రజలు ఫోటోలకు మార్కులు వేయరు& రైతు పంట కొనుగోలుకే తీర్పు ఇస్తారు అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్కు మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ హితవు పలికారు. బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.






