దేశప్రజలకు సుస్థిర పాలన అందించిన ఘనత మోడీదే..
మల్కాజ్‌గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్
కూకట్ పల్లి, జూన్ 11 (విజయక్రాంతి): దేశంలో సంకీర్ణ రాజకీయాలకు స్వస్తి పలికి దేశ ప్రజలకు సుస్థిర పాలన అందించిన ఘనత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకే దక్కిందని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కూకట్ పల్లి బిజెపి కార్యాలయంలో గురువారం ఏర్పాటు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో రూపొందించిన ’దేశ నిర్మాణమే ఏకైక లక్ష్యం’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో సంకీర్ణ రాజకీయాలు రాజ్యమేలుతున్న కాలంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ దేశ ప్రజలకు సుస్థిర పాలన అందించాడన్నారు. భారతదేశంలో ప్రజల చేత ఎన్నుకోబడి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా ఉన్న ఘనత నరేంద్ర మోడీకే దక్కిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలోంచి బయటపడాలన్న గుజరాత్ లాగా అభివృద్ధి చెందాలన్నా బిజెపి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఘనత నరేంద్ర మోడీదే అన్నారు. ప్రతి భారతీయుడునేను భారతీయుడినని గర్వంగా చెప్పుకునే స్థాయికి దేశాభివృద్ధిని నరేంద్ర మోడీ తీసుకెళ్లాడని తెలిపారు.
ఒకప్పుడు ప్రపంచంలో మూడో పేద దేశంగా భారత దేశం ఉండేదని, మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర హయాంలో మన దేశ బంగారాన్ని లండన్ లో దేశ అవసరాల కోసం కుదువ పెట్టారని పేర్కొన్నారు. 2014 సంవత్సరానికి పూర్వం రెండు లక్షల కోట్ల రూపాయలతో దేశ బడ్జెట్ ప్రవేశపెట్టేవారని ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం హయాంలో అది 12 లక్షల కోట్ల రూపాయల స్థాయికి ఎదిగిందని తెలిపారు.
నిరుపేద కుటుంబంలో పుట్టి పేద వాళ్ళ బాధలు తెలిసిన చాయ్ వాలాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిరుపేదల అభ్యున్నతి కోసం గ్రామస్థాయి మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు అన్నారు. గ్రామస్థాయి మహిళలు పడుతున్న ఇబ్బందులను దూరం చేయడంలో లక్ష్యంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రోత్సహించారన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు, ప్రతి ఎకరానికి సాగునీరు అందించడంలో భాగంగా హార్ ఘర్ జల్ కార్యక్రమం ఏర్పాటు చేశారన్నారు.
దేశానికి వెన్నెముక వ్యవసాయదారులే అని రైతులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో సన్మాన్ నిధి ద్వారా రూ.6 వేల రూపాయలను మూడు విడతలుగా వ్యవసాయదారులకు అందిస్తున్నాడన్నారు. గత ప్రభుత్వాల హయాంలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడ్డారని, యూరియా కోసం లైన్ లలో నిలబడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు గతంలో ఉన్నాయని, వ్యవసాయ రంగానికి ఊతం ఇవ్వాలనే ఉద్దేశంతో యూరియాకు రెండు లక్షల కోట్ల సబ్సిడీ ఇచ్చారని పేర్కొన్నారు.
30 సంవత్సరాల క్రితం మూతబడ్డ రామగుండం యూరియా కర్మాగారాన్ని 6300 కోట్లు కేటాయించి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. గత ప్రభుత్వలా హయాంలో గ్రామాలకు సరైన రోడ్డు సదుపాయాలు ఉండేవి కాదని, మట్టి రోడ్లు కంకర రోడ్డు సౌకర్యం కూడా లేని గ్రామాలు ఉండేవని, బిజెపి ప్రభుత్వం ఏర్పడ్డాక వాజ్ పేయి ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన గ్రామీణ సడక్ యోజన పథకం ద్వారా దేశంలో ప్రతి గ్రామానికి రోడ్డు వ్యవస్థను కల్పించిన ఘనత నరేంద్ర మోడీ దేనని తెలిపారు.
2014 సంవత్సరాలకు పూర్వం దేశంలో జాతీయ రహదారులు 2 వేల 500 కిలోమీటర్లు మాత్రమే ఉండేవని మోడీ నాయకత్వంలో 2 వేల 19 సంవత్సరం వరకు అంతకు రెట్టింపుగా 5 వేల కిలోమీటర్లు జాతీయ రహదారులు ఏర్పాటు చేశారని, గత ప్రభుత్వాల హయాంలో రోజుకు 11 కిలోమీటర్లు జాతీయ రహదారి నిర్మాణం జరిగేదని ప్రస్తుతం మోడీ గారి ప్రభుత్వంలో రోజుకు 36 కిలోమీటర్లు జాతీయ రహదారి నిర్మిస్తున్నారని తెలిపారు.
మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టక ముందు దేశంలో 74 విమానాశ్రయాలు ఉండేవని, ప్రస్తుతం దేశంలో 164 విమానాశ్రయాలు అభివృద్ధి చేశారన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ దేశాలకే ఆహారం అందించే దేశంగా ఎదిగిందని, కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అంతా వనికిస్తున్న సమయంలో దేశ ప్రజలకు ధైర్యం చెప్పిన నాయకుడు నరేంద్ర మోడీ అని, దేశానికే కాక ప్రపంచ దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించడంలో ప్రధాని మోడీ పాత్ర కీలకమన్నారు.
ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ ప్రధాని నరేంద్ర మోడీ అని రష్యా అధ్యక్షుడు పుతిన్ కొనియాడిన సంఘటనను ఈ సందర్భంగా గుర్తు చేశారు. నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం దేశంలో తీవ్రవాద సంఘటనలు రూపుమాపబడ్డాయని, గతంలో హైదరాబాదులో జరిగిన తీవ్రవాద దాడులను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.దేశ ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ అని కొనియాడారు.
రక్షణ రంగంలో యుద్దసామాగ్రిని దిగుమతి చేసుకునే స్థాయి నుండి 60 శాతం సామాగ్రిని ఎగుమతి చేసే స్థాయికి మోడీ నాయకత్వంలో భారతదేశం ఎదిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా భాజపా అధ్యక్షులు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, కూకట్పల్లి బాజపా నియోజకవర్గ ఇంచార్జ్ మాధవరం కాంతారావు, జిల్లా భాజపా ఇంచార్జ్ మహేందర్ గౌడ్, జిల్లా భాజపా మీడియా ఇంచార్జ్ సమత, జిల్లా ప్రధాన కార్యదర్శి విగ్నేశ్వర్, భాజపా నాయకులు గిరి వర్ధన్ రెడ్డి,పద్మయ్య తదితరులు పాల్గొన్నారు.






