హైదరాబాద్‌కు తాగునీటి సరఫరాలో అంతరాయం
- మంజీరా ఫేజ్ -2 ప్రధాన పైప్‌లైన్‌లో భారీ లీకేజీ
- మరమ్మతులు చేపట్టిన జలమండలి అధికారులు
సంగారెడ్డి, జూన్ 11(విజయక్రాంతి): హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరా చేసే మంజీరా ఫేజ్--2 ప్రధాన పైప్‌లైన్‌లో భారీ లీకేజీ ఏర్పడింది. దీంతో పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని జలమండలి అధికారులు గురువా రం ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామం సమీపంలో కలబూర్గ్ -పటాన్‌చెరు పంపింగ్ మెయిన్‌కు చెందిన 1500 మి.మీ. వ్యాసం గల భారీ పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్పడింది.
జలమండలి ఉన్నతాధికారులు యుద్ధప్రాతిపదికన అత్యవసర మరమ్మతు పనులను ప్రారంభించారు. దీంతో మంజీరా ఫేజ్--2 ద్వారా నీటి సరఫరా పొందే డివిజన్లు, కాలనీలలో నీటి పీడనం తగ్గడం లేదా పూర్తిగా సరఫ రా నిలిచిపోతుందన్నారు. మియాపూర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీకాలనీ, ప్రగతినగర్, చందా నగర్, లింగంపల్లి, మదీనాగూడ, గంగారం, అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్, ఎర్రగడ్డ, ఆర్సీపురం, అశోక్‌నగర్, జ్యోతినగర్, బీరంగూడ, అమీన్‌పూర్, భాగ్యనగర్ కాలనీలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికా రులు తెలిపారు.
యుద్ధప్రాతిపదికన మరమ్మతులు..
జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆపరేషన్స్, ట్రాన్స్‌మిషన్ విభాగానికి చెందిన సాంకేతిక బృందాలు క్షేత్రస్థాయిలో లీకేజీని అరికట్టే పనులను వేగవం తం చేశాయి. కాగా తాగునీటి సరఫరా నిలిచిపోయిన కాలనీల ప్రజలకు ఇబ్బంది కలగకుం డా అవసరమైన చోట్ల జలమండలి ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీటిని సరఫరా చేయాలని ఎండీ అధికారులను ఆదేశించారు.
పైప్‌లైన్ మరమ్మతు పనులు పూర్తయి, యథావిధిగా నీటి సరఫరా పునరుద్ధరించబడే వరకు నగరవాసులు తమ వద్ద ఉన్న నీటిని అత్యంత పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులు కోరారు. పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.






