12 June, 2026 | 2:32 AM

ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులు ఏకగ్రీవం

12-06-2026 01:26 AM

బీజేపీ నుంచి ఎంపీలుగా రజనీష్ అగర్వాల్, తరుణ్ చుగ్, మహేష్ కేవత్

మధ్యప్రదేశ్‌లో అనూహ్యపరిణామం

సుప్రీంకోర్టులో మీనాక్షి పిటిషన్.. నేడు విచారణ

భోపాల్/న్యూఢిల్లీ, జూన్ 11 (విజయక్రాంతి): మధ్యప్రదేశ్‌లో బీజేపీ ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. రజనీష్ అగర్వాల్, తరుణ్ చుగ్, మహేష్ కేవత్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. అయితే మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి, పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతో ఓటింగ్ నిర్వహించాల్సిన అవసరం లేకుండానే మూడు రాజ్యసభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవ మయ్యారు.   

అనంతరం రజనీష్ అగర్వాల్, తరుణ్ చుగ్, మహేష్ కేవత్ మధ్యప్రదేశ్ అసెంబ్లీకి చేరుకుని, తమ ఎన్నిక ధ్రువీకరణ పత్రాలను స్వీకరించారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం రాజకీయంగా, న్యాయపరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తన నామినేషన్ను చట్టవిరుద్ధంగా తిరస్కరించారని ఆరోపిస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం (జూన్ 12) విచారణ జరగనుంది.

జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అతుల్ ఎస్.చందుర్‌కర్ల ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. మీనాక్షి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తున్నారు. కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియ మధ్య ఈ పిటిషన్‌ను ఎలా స్వీకరించవచ్చని ధర్మాసనం ప్రశ్నించినప్పటికీ, న్యాయం కోసం కేసును పరిగణనలోకి తీసుకోవాలని సింఘ్వీ కోరారు. ప్రజాప్రాతినిథ్య చట్టం ప్రకారం క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడించలేదనే కారణంతో రిటర్నింగ్ అధికారి నామినేషన్‌ను తిరస్కరించారని, అది సరైన నిర్ణయం కాదని ఆయన వాదిస్తున్నారు.

అయితే రిటర్నింగ్ అధికారి మాత్రం మీనాక్షి సమర్పించిన అఫిడవిట్ అసంపూర్ణంగా ఉందని పేర్కొన్నారు. నామినేషన్‌తో పాటు సమర్పించిన ఫారం-26లో కోర్టు ఫిర్యాదు వివరాలు పొందుపరచలేదని తన ఉత్తర్వులో స్పష్టం చేశారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ అభ్యర్థి మహేష్ కేవత్ కూడా రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.

తెలంగాణలో నమోదైన కేసును మీనాక్షి తన అఫిడవిట్‌లో వెల్లడించలేదని ఆయన ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను కాంగ్రెస్ పక్షం ఖండిస్తోంది. కనీసం రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్న కేసులను మాత్రమే వెల్లడించాల్సి ఉంటుందని, ఈ కేసులో కేవలం సమన్లు మాత్రమే జారీ అయ్యాయని అభిషేక్ సింఘ్వీ వాదిస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఈ వివాదానికి కీలక మలుపు తిప్పనుంది. రాజకీయ వర్గాలు కూడా ఈ కేసు ఫలితంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.