9 July, 2026 | 1:18 AM

తెలంగాణలో భారీ భూదోపిడీ!

09-07-2026 12:00 AM
  1. కొండా వెంకట రంగారెడ్డి కుట్ర 
  2. నిజాం చారిత్రక ఫర్మానాను దాచారు
  3.    1954-55 లో కాస్రా పహానీతో కబ్జాలు
  4. నేటి రైతు భరోసా వరకు రెడ్లు, వెలమల కుట్రలు!
  5. - ఈ లెక్కలపై చర్చకు సిద్ధం..ఎవరొస్తాడో రండి
  6. - టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సవాల్

హైదాబాద్, జూలై 8 (విజయక్రాంతి): తెలంగాణలో భారీ భూదోపిడీ జరిగిందని, నిజాం ప్రభువు జారీ చేసిన చారిత్రక ఫర్మానాను దాచి, అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి కొండా వెంకట రంగారెడ్డి 1954--55 లో కాస్రా పహానీతో భూ కబ్జాలు చేశారని టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపించారు.

నేటి రైతు భరోసా వరకు రెడ్లు, వెలమల కుట్రలు చేస్తున్నారని, ఈ లెక్కలపై తాను చర్చకు సిద్ధమని, ఎవరొస్తాడో రావాలని సవాల్ చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు కనీసం రెండు ఎకరాల భూమి పంచుతామని వరంగల్ డిక్లరేషన్‌లో చేసిన వాగ్ధానం ఎలా సాధ్యమవుతుందో, ‘నిజాం వదిలిపెట్టిన తెలంగాణ‘ ద్వారా ఈ భూమిని ఎలా వెలికితీస్తామో ఆయన స్పష్టం చేశారు. 

నిజాం వదిలిపెట్టిన తెలంగాణ నిజాలు

దేశ స్వాంతంత్య్రానికి ముందే 1927లో నిజాం నవాబు వెట్టిచాకిరిని రద్దు చేస్తూ చట్టం చేశారు. కానీ అప్పటి గడీల దొరలు దానిని అమలు కానివ్వలేదు. 1945 నాటికి కౌలుదారులకు శాశ్వత సాగు హక్కులు కల్పిస్తూ నిజాం చట్టాలు చేశారని మల్లన్న తెలిపారు. 1949 ఆగస్టు 15న నిజాం ఒక చారిత్రాత్మక ఫర్మానా జారీ చేశారు. దీని ద్వారా మక్తాలు, సంస్థానాలు, చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న జాగీర్ల వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి, ఆ భూమి అంతా పేదలకే దక్కేలా ఆదేశాలు ఇచ్చారు.

హైదరాబాద్ జాగీర్దార్ నిషేధ చట్టం కింద 995 మంది జాగీర్దారుల (దొరల) నుంచి సుమారు కోటి ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుని, వారికి పరిహారంగా నిజాం ప్రభుత్వం 18 కోట్ల రూపాయలు చెల్లించింది. అంటే ఆ నాటితోనే ఆ భూములపై రెడ్లకు, వెలమలకు హక్కులు పోయాయి. ఈ నిజాలన్నీ ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం పుస్తకంలో (పేజీ 101, 102) ఆధారాలతో సహా ఉన్నాయని తెలిపారు.

కొండా వెంకట రంగారెడ్డి కుట్ర 

నిజాం పాలన అంతమైన తర్వాత, బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వంలో కొండా వెంకట రంగారెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి అయ్యారు. ఆయన రెవెన్యూ మంత్రిగా నిజాం ఇచ్చిన చారిత్రక ఫర్మానాను తుంగలో తొక్కి, దాచిపెట్టి, 1954--55లో కాస్రా పహానీ అనే దొంగ పహానీని సృష్టించారు. దీని ద్వారా పరిహారం కింద 18 కోట్లు తీసుకున్న దొరలకు, జాగీర్దారులకు మళ్లీ ఆ కోటి ఎకరాల భూములపై యాజమాన్య హక్కులు కట్టబెట్టారు. నాటి నుంచి నేటి వరకు సుమారు 70 ఏళ్లుగా రెవెన్యూ శాఖను రెడ్లు తమ గుప్పిట్లోనే ఉంచుకున్నారు మండిపడ్డారు.

నేటి ప్రభుత్వ పథకాలు

తెలంగాణలో రెడ్ల జనాభా 4.5% లోపే ఉన్నా, వారి చేతిలో 13.5% భూములు ఉన్నాయి. ఒక్కొక్క రెడ్డి కుటుంబానికి రైతు భరోసా ద్వారా సగటున రూ.5,94,483 లబ్ధి చేకూరితే, యాదవ కుటుంబానికి రూ.3,50,000, ముదిరాజ్ కుటుంబానికి రూ.2,45,000, గౌడ కుటుంబానికి రూ.2,23,000, రజకులకు రూ.1,68,000, నాయి బ్రాహ్మణులకు రూ.1,03,000, పద్మశాలీలకు రూ.1,12,000 మాత్రమే లబ్ధి చేకూరిందని ఆవేదన చెందారు. రూ.2,57,400 కోట్ల వ్యవసాయ బడ్జెట్‌లో కేవలం రెడ్లకే రూ.34,749 కోట్లు, కమ్మలకు రూ.5,148 కోట్లు, వెలమలకు రూ.2,574 కోట్లు వెళ్లాయి. ఒక రెడ్డి రైతుకు సగటున ఏడాదికి రూ.37,859 వివిధ పథకాల ద్వారా వస్తుంటే, బీసీ రైతుకు కేవలం రూ.11,999 మాత్రమే వస్తున్నాయి.

అప్పుల భారం బీసీలదే

వ్యవసాయ పథకాల కోసం తెచ్చిన రూ.2,75,000 కోట్ల అప్పుల్లో, అగ్రవర్ణాల (రెడ్లు, వెలమలు, కమ్మలు) నెత్తి మీద పడ్డ అప్పు రూ.15,958 కోట్లు కాగా, వారు పొందిన లబ్ధి రూ.42,471 కోట్లు (నికర లాభం 26,512 కోట్లు). అదే బీసీల నెత్తి మీద పడ్డ అప్పు రూ.45,773 కోట్లు కాగా, వారికి తీవ్ర నష్టం చేకూరుతోంది. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో 59 చోట్ల రెడ్లు, వెలమలు, కమ్మలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ 59 నియోజకవర్గాల్లో వారి మొత్తం జనాభా కేవలం 8,80,000 అయితే, బీసీల జనాభా 90 లక్షలు. అయినా ఒక్క బీసీ కూడా ఇక్కడ ఎమ్మెల్యే కాలేదు.

సగటున 1,679 వెలమ ఓట్లకు ఒక వెలమ ఎమ్మెల్యే, 18,626 రెడ్డి ఓట్లకు ఒక రెడ్డి ఎమ్మెల్యే తయారవుతుంటే, 1,46,951 బీసీ ఓట్లున్నా ఒక్క బీసీ ఎమ్మెల్యే లేడు అని చెప్పారు. గజ్వేల్‌లో కేవలం 480 వెలమ ఓట్లు ఉంటే, 1,74,769 బీసీ ఓట్లు ఉన్నాయి. సిరిసిల్లలో కేవలం 2,735 వెలమ ఓట్లు ఉంటే, 1,33,391 బీసీ ఓట్లు ఉన్నాయి. సిద్దిపేటలో కేవలం 410 వెలమ ఓట్లు ఉంటే, 1,49,343 బీసీ ఓట్లు ఉన్నాయి. కొడంగల్‌లో 12,000 లోపు రెడ్డి ఓట్లు ఉంటే, 1,37,406 బీసీ ఓట్లు ఉన్నాయి.

ఉప్పల్, మేడ్చల్ నియోజకవర్గాల్లోనూ లక్షల్లో బీసీ ఓటర్లు ఉన్నప్పటికీ అగ్రవర్ణాలే గెలుస్తున్నారని ఇది సామాజిక న్యాయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఈ చారిత్రక అన్యాయాన్ని, భూదోపిడీని అంతం చేయడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ‘ఆపరేషన్ సర్జికల్ స్ట్రైక్ 59‘ కు శ్రీకారం చుట్టిందని, అగ్రవర్ణాల గుప్పిట్లో ఉన్న ఈ 59 స్థానాలను బద్దలు కొట్టి, 2028లో బీసీ ప్రభుత్వాన్ని స్థాపిస్తామని మల్లన్న చెప్పారు. తాను బయటపెట్టిన ఈ లెక్కల్లో ఒక్క పైసా తేడా ఉన్నా లేదా ఏ ఒక్క అంకె తప్పయినా, ఏ రెడ్డి, వెలమ, కమ్మ నాయకుడైనా సరే నాతో చర్చకు రావాలని, తాను దేనికైనా సిద్ధంగా ఉన్నానని బహిరంగ సవాల్ విసిరారు. 

పీవీ భూ సంస్కరణలను అడ్డుకున్నారు

1970లో ముఖ్యమంత్రి అయిన పీవీ నరసింహారావు.. ఇందిరా గాంధీ అనుమతితో ఒక కుటుంబానికి 54 ఎకరాలకు మించి భూమి ఉండకూడదని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ (భూ గరిష్ట పరిమితి చట్టం) డ్రాఫ్ట్ చేశారు. దీన్ని అడ్డుకోవడానికి 400 మంది భూస్వాములు (రెడ్లు, వెలమలు) రాత్రికి రాత్రే తమ భార్యలకు విడాకులు ఇచ్చారని చెప్పారు. గర్భంలో ఉన్న పిండం పేరు మీద, చివరికి కుక్కలు, నక్కల పేరు మీద భూములను రిజిస్టర్ చేసి చట్టం నుంచి తప్పించుకున్నారని (ఈ విషయాలు 1972 అసెంబ్లీ రికార్డుల్లో, మద్దికాయల ఓంకార్ ప్రసంగాల్లో ఉన్నాయి) వివరించారు.

ఈ చట్టాన్ని అమలు చేయబోయిన పీవీ నరసింహారావుపై జై ఆంధ్ర ఉద్యమాన్ని బూచిగా చూపి, ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించేలా కుట్ర చేశారని ఆగ్రహించారు. స్పీకర్ పిడతల రంగారెడ్డి సభను బహిష్కరించినా, డిప్యూటీ స్పీకర్గా ఉన్న ముదిరాజ్ బిడ్డ సి. జగన్నాథరావు ప్రలోభాలకు లొంగకుండా ఈ బిల్లును పాస్ చేశారని, అయినా ఈ చట్టం సరిగ్గా అమలు కాకుండా రెడ్లు వెలమలు కుట్ర చేశారని ధ్వజమెత్తారు.