9 July, 2026 | 2:04 AM

15 నాటికి ఈపీఎఫ్‌వో వడ్డీ జమ

09-07-2026 01:12 AM
  1. రూ.1.44 లక్షల కోట్ల మేర జమ చేసేందుకు కసరత్తు
  2. కేంద్రం ఇటీవల ఆమోదించిన ౮.౨౫ వడ్డీ రేటు ప్రకారమే జమ
  3. దేశవ్యాప్తంగా ౩౪ కోట్ల మంది ఖాతాదారులకు లబ్ధి
  4. ప్రస్తుతం వెరిఫికేషన్ దశలో సొమ్ము జమ ప్రక్రియ

న్యూఢిల్లీ, జూలై ౮: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) ఖాతాదారులకు తీపికబురు అందించింది. 2025 -26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పీఎఫ్ వడ్డీని ఈ నెల ౧౫లోపు జమ చేస్తామని బుధవారం ప్రకటించింది. తద్వారా 34 కోట్ల మంది ఖాతాదారులకు చేకూరనుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ.1.44 లక్షల కోట్ల మేర జమ అవుతుందని అంచనా. కేంద్ర ప్రభుత్వం గత నెలలోనే పీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును ఆమోదించిన సంగతి తెలిసిందే.

కేంద్రం ఆమోదించిన వడ్డీ రేటు ప్రాతిపదికనే వడ్డీ జమ చేస్తామని ఈపీఎఫ్‌వో స్పష్టం చేసింది. ఇప్పటికే వడ్డీ జమ చేసే ప్రక్రియ పనులు వేగంగా సాగుతున్నాయని, ప్రస్తుతం ఆ పనులు వెరిఫికేషన్ దశలో ఉన్నాయని తెలిపింది. సంస్థ పరిధిలో ‘సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్ సర్వీసెస్’ పేరుతో కొత్త డిజిటల్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చామని, ఈ వ్యవస్థ ద్వారా జాతీయస్థాయి డేటాబేస్ కింద ప్రాంతీయ డేటాబేస్‌ను అనుసంధానం చేయవచ్చని తెలిపింది.

కొత్త విధానం ద్వారా ఖాతాదారులు రికార్డులన్నీ ఒకచోటే ఉంటాయని, సంస్థకు వారికి సేవలందించడం సులభతరం అవుతుందని వివరించింది. గతంలో వేర్వేరు సేవలకు వేర్వేరు పోర్టల్స్ ఉండేవని, ఖాతాదారుల సౌకర్యార్థం త్వరలోనే ఒకే యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపింది. అలాగే, ఆటోమెటెడ్ క్లెయిమ్ పరిమితిని లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచామని తెలిపింది.

ఈపీఎఫ్‌వో వడ్డీ జమ అంశంపై బుధవారం కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ.. వడ్డీ జమ ప్రక్రియ ఆటోమేటిక్‌గా జరుగుతుందని తెలిపారు. 15వ తేదీ నాటికి ఖాతాదారులు తమ పాస్‌బుక్స్‌లో అప్‌డేట్ అయిన వడ్డీ మొత్తాన్ని చూసుకోవచ్చని స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వ అనుమతి వచ్చిన తర్వాత అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో ఈ ప్రక్రియ జరిగేదని, ఈసారి ముందుగానే పూర్తి చేస్తున్నామని వివరించారు.