మా కృషితోనే కేంద్రం అనుమతి
- తాడిచెర్ల బ్లాక్ కొత్త కేటాయింపు కాదు.. పాతదానికే అనుమతి
- సింగరేణిపై ప్రేముంటే గోదావరి లోయ బ్లాకులన్నీ కేటాయించాలి
- ప్రైవేట్‌కు ఇచ్చినవీ సింగరేణికే ఇవ్వాలి
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): సింగరేణి కాలరీస్ సంస్థకు తాడిచెర-2 కోల్ బ్లాక్ కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను మరుగున పరిచి, తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. సింగరేణికి 2013లో కేటాయించిన తాడిచర్ల-2 బ్లాకును మళ్లీ సింగరేణికి కేటాయిస్తున్నట్టు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించడాన్ని ఆయన ఖండించారు.
ఇప్పటికే కేటాయించిన తాడిచర్ల బ్లాక్‌కు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మంజూరు చేసింది కేవలం లీజు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజా భవన్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సింగరేణికి 2010 నుంచి 2012 వరకు కేంద్ర బొగ్గు శాఖకు చేసిన విజ్ఞప్తులపై స్పంది స్తూ నాటి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ 2013 సెప్టెంబర్ 16న తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణి సంస్థకు కేటాయించిందన్నారు.
కేటాయింపు లేఖలో స్పష్టంగా ఈ బ్లాకులో గిరిజన భూములు ఉన్నందున వాటిని ప్రభుత్వ రంగ సంస్థలే బొగ్గును తీయాలని పేర్కొందన్నారు. ఈ బ్లాకుల అన్వేషణ, అభివృద్ధి పను లు వేగంగా చేసి వీలైనంత త్వరగా బొగ్గు ఉత్ప త్తి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నాడు కేంద్ర ప్రభుత్వం ఈ కేటాయింపు లేఖలో సింగరేణికి సూచించిందని చెప్పారు. కొత్తగా బ్లాకును కేటాయిస్తు న్న ట్టు ప్రకటించటం విచారకరమని పేర్కొన్నారు.
అక్కడ గిరిజనులకే సర్వ హక్కులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మణుగూ రు, ఇల్లందు వంటి సింగరేణి ప్రాంతాలు 1/70 గిరిజన చట్టం పరిధిలోకి వస్తాయని చె ప్పారు. ఇక్కడ గిరిజనులు మాత్రమే భూమిపై సర్వ హక్కులు కలిగి ఉంటారని చెప్పారు. కేం ద్ర ప్రభుత్వం ఇల్లందు సమీపంలోని కోయగూడెం-3 ఓపెన్ కాస్ట్ బ్లాక్‌ను, మణుగూరు లోని ఓపెన్ కాస్ట్ డిప్ సైడు గనిని వేలం పాటలో పెట్టడం చట్టానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయమని విమర్శించారు.
సింగరేణి సంస్థ ప్రభుత్వ రంగ సంస్థ కనుక.. ఇక్కడ బొ గ్గు తవ్వి తీసే అధికారం కేవలం సింగరేణికే ఉంటుందని పలు లేఖల ద్వారా కేంద్రానికి చె ప్పామని అన్నారు. సింగరేణి సంస్థపై కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ప్రేమ ఉంటే సింగరేణిని విస్తరించాలన్నారు. మీడియా సమావేశంలో సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి, సింగరేణి డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, గౌతమ్ పోట్రు ఇతర అధికారులు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం ట్రెండీ లుక్
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొత్త లుక్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇటీవల కంటికి శస్త్రచికిత్స చే యించుకున్న భట్టి.. వైద్యుల సూచన మేర కు ప్రస్తుతం కళ్లజోడు ధరిస్తున్నారు. దీంతో భట్టి విక్రమార్కకు సరికొత్త, ట్రెండీ లుక్ వచ్చినట్లు రాజకీయ వర్గాలు, అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇటీవల నిర్వహించిన అధికారిక కార్యక్రమాల్లోనూ, సమావేశాల్లోనూ ఆయన కళ్లజోడుతోనే పాల్గొన్నారు. సోషల్ మీడియాలో కూడా భట్టి విక్రమార్క తాజా ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా సాదాసీదా రూపం లో కనిపించే భట్టి, ఇప్పుడు కళ్లజోడుతో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కంటి ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడే వరకు వైద్యుల సూచనలను పాటిస్తూ కళ్లజోడును ఉపయోగించనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా శస్త్రచికిత్స అనంతరం కూడా ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో యథావిధిగా పాల్గొంటూ విధులు నిర్వహిస్తున్నారు.






