9 July, 2026 | 2:04 AM

సింగరేణికి ‘తాడిచర్ల ఫేస్-2’ కేటాయింపుతో ఉపాధి అవకాశాలు

09-07-2026 01:15 AM

మంథనిలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం

మంథని, జూలై 8 (విజయక్రాంతి): మంథని నియోజకవర్గ అభివృద్ధిలో మరో కీలక మైలురాయి నమోదైంది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర బిజెపి ప్రతినిధుల బృందం ప్రత్యేక చొరవతో మంథని నియోజకవర్గంలోని తాడిచర్ల ఫేస్-2 బొగ్గు బ్లాక్ను కేంద్ర ప్రభుత్వం నేరుగా సింగరేణి సంస్థకు కేటాయించింది.

ఎటువంటి వేలం ప్రక్రియ లేకుండా, చారిత్రాత్మక నిర్ణయంతో ఈ బ్లాక్ను కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతగా మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బిజెపి శ్రేణులు ఘనంగా సంబరాలు నిర్వహించారు.

భారతీయ జనతా పార్టీ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు, మంథని పట్టణ మండల కమిటీ పక్షాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా బిజెపి పార్టీ పట్టణ అధ్యక్షుడు సబ్బని సంతోష్, జిల్లా కౌన్సిల్ మెంబర్ బోగోజు శ్రీనివాస్, మంథని పట్టణ మాజీ అధ్యక్షులు బూడిద తిరుపతి మాట్లాడుతూ.. వేలం ప్రక్రియ లేకుండా నేరుగా సింగరేణికి తాడిచర్ల-II బొగ్గు బ్లాక్ను కేటాయించడం, ఈ ప్రాంతంపై ప్రధాని మోదీకి ఉన్న ప్రేమకు నిదర్శనమన్నారు.

ఇది కేవలం బొగ్గు బ్లాక్ కేటాయింపు మాత్రమే కాదని, తెలంగాణ ప్రాంత ఆర్థిక ప్రగతికి వేసిన బలమైన పునాది అని కొనియాడారు.ఈ భారీ లబ్ధిని చేకూర్చిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి మంథని ప్రాంత ప్రజల తరఫున నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలను బీజేపీ కార్యకర్తలు ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని, రానున్న ఎన్నికల్లో మంథని గడ్డపై బిజెపి జెండాను ఎగరేసేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సంబరాలలో అసెంబ్లీ కో కన్వీనర్ నాంపల్లి రమేష్, సీనియర్ నాయకులు నారమల్ల కృష్ణ, పట్టణ ప్రధాన కార్యదర్శి సామల అశోక్, పట్టణ ఉపాధ్యక్షులు బొల్లంపల్లి లక్ష్మణ్, దాసరి శ్రవణ్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు రేపాక శంకర్, పట్టణ కార్యదర్శి పార్వతి విష్ణు, పట్టణ కోశాధికారి వొడ్నాల శ్రీనివాస్, పట్టణ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు షరీఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.