9 July, 2026 | 1:41 AM

పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ కన్నుమూత

09-07-2026 01:14 AM

పవన్, సోను సూద్, బండ్ల గణేష్ దిగ్భ్రాంతి

హనుమకొండ (మహబూబాబాద్), జూలై 8 (విజయక్రాంతి): సినీ నటులు పవన్ కళ్యాణ్, సోను సూద్‌ల అభిమాని హనుమకొండకు చెందిన పొనగంటి నిరంజన్ (17) బుధవారం కన్నుమూశారు. అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతున్నాడు. తాను అభిమానించే నటుడు పవన్‌కళ్యాణ్‌ను కలవాలని ఉన్నదని నిరంజన్ చెప్పడంతో.. జనసేన నేతల ద్వారా విషయం తెలసుకున్న పవన్ కళ్యాణ్ ఇటీవలే స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఇద్దరం కలిసి ‘ఓజీ’ సినిమా చూద్దాం అంటూ ఆప్యాయంగా మాట్లాడి, బహుమతులు అందజేసి నిరంజన్‌కు మనోధైర్యం కల్పించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారుజామున నిరంజన్ కన్నుమూశాడు. నిరంజన్ మరణ వార్త తెలుసుకున్న సినీ నటుడు సోను సూద్ నిరంజన్ కుటుంబ సభ్యులతో వీడియో కాల్ చేసి పరామర్శించారు. నిరంజన్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అనారోగ్యంతో బాధపడుతున్న నిరంజన్ తన పట్ల ఎంతో అభిమానంతో తనను కలిసేందుకు కుటుంబ సభ్యులకు వచ్చిన సందర్భాన్ని చిరకాలం గుర్తుంది పోతుందని సోనూసూద్ ఎక్స్‌లో పేర్కొన్నారు. నిరంజన్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. నిర్మాత బండ్ల గణేష్ నిరంజన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. బండ్ల గణేష్ కూడా నిరంజన్ ను ఇటీవల పరామర్శించి ఆర్థిక సహాయం అందించి కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా హనుమకొండలో నిర్వహించిన నిరంజన్ అంత్యక్రియలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.