9 July, 2026 | 1:18 AM

ఏ తప్పూ చేయలేదు.. వివరణ ఎందుకివ్వాలి?

09-07-2026 12:00 AM
  1. నేను రూల్స్ అతిక్రమించలేదు 
  2. నా అధికారాలు, పరిమితులు నాకు తెలుసు
  3. కాంట్రవర్సీలతో వార్తల్లో ఉండాలని చూస్తున్నారు 
  4. అవగాహనా లోపంతో మాట్లాడుతున్నారు
  5. మంత్రి కొండా సురేఖ ఫిర్యాదుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలు  

స్టేషన్ ఘనాపూర్/మహబూబాబాద్, జూలై 8 (విజయక్రాంతి): ‘నేను ఏ తప్పూ చేయలేదు. రూల్స్ అతిక్రమించలేదు. తప్పు చేయనప్పుడు వివరణ ఎందుకివ్వాలి? కాంట్రవర్సీలు సృష్టించి, వార్తల్లో ఉండాలని అవగాహనా లోపంతో మాట్లాడుతున్నారు. నా అధికారాలు, పరిమితులు ఏంటో నాకు తెలుసు’ అని మంత్రి కొండా సురేఖ ఫిర్యాదుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు.

దేవాదాయ శాఖ అధికారులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించడంపై గుర్రుగా ఉన్న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.. నాకు సమాచారం ఇవ్వకుండా నా మంత్రిత్వ శాఖ పరిధిని బేఖాతరు చేశారని, భవిష్యత్తులో ఇలా జరగకుండా పార్టీ క్రమశిక్షణ కమిటీ ద్వారా విచారణ జరిపించి కడియంపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి మంగళవారం చేసిన ఫిర్యాదుపై స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బుధవారం స్పందించారు.

స్టేషన్ ఘనాపూర్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఒక ఎమ్మెల్యేగా, ప్రజా ప్రతినిధిగా ఏ అధికారినైనా కలిసే హక్కు నాకు ఉంది, నా నియోజకవర్గ సమస్యలు తెలపడం ఎమ్మెల్యేగా నా హక్కు. నాకు రూల్స్ తెలుసు. నేను ఎక్కడా రూల్స్ అతిక్రమించలేదు. బిజినెస్ రూల్స్, రాజ్యాంగ ప్రకారం క్యాబినెట్ ర్యాంక్‌లో ఉన్నవారు మాత్రమే సమీక్ష చేస్తారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమీక్షలో పాల్గొంటారు.

నా నియోజకవర్గ పరిధిలోని ఆలయాల అభివృద్ధిపై వారి కార్యాలయానికి వెళ్లి దేవాదాయ శాఖ కమిషనర్‌ను కలిసాను. ఆలయాల అభివృద్ధికి ఆలయ కమిటీ చైర్మన్లతో కలిసి పలు వినతి పత్రాలు అందజేశాను. నేను తప్పు చేయనప్పుడు ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేశారు. ‘అవగాహనా లోపంతో మాట్లాడుతున్నారు. నా అధికారాలు, పరిమితులు ఏంటో నాకు తెలుసు, నాపై ఇలాంటి వార్తలు రావడం చాలా బాధగా ఉంది.

అభివృద్ధి గురించి ఆలోచించని వారు, ప్రజల మధ్యలో ఉండని వారు కాంట్రావర్సీలు సృష్టించి వార్తల్లో ఉండాలని చూస్తారు’ అని విమర్శించారు. అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా అనవసర విషయాలపై దృష్టి పెడుతున్నారని, ఉమ్మడి జిల్లాను పట్టించుకునే వారే లేరని పేర్కొన్నారు.

వర్షాబావ పరిస్థితుల నేపథ్యంలో దేవాదులపై దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఎవరిదని, ఎంజీఎం ఆసుపత్రికి సూపరిండెంట్ లేడు దానిని ఎవరూ పట్టించుకోవాలి, సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవం చేయాలి దాన్ని పట్టించుకునే వారే లేరన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజి టెండర్లు పూర్తి చేయించి పనులు ప్రాంభించడానికి చొరవ తీసుకోవాల్సింది ఎవరు, అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలి తప్ప కాంట్రావర్సీల కోసం కాదని కడియం పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో కడియం వర్సెస్ కొండా లొల్లి గందరగోళం రేపుతోంది.