11 March, 2026 | 7:40 PM

రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది

11-03-2026 05:14 PM

- మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి 

చెన్నూర్,(విజయక్రాంతి): రాష్ట్రంలో రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ పట్టణంలో గల పాత మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా మార్కెటింగ్ అధికారి షహబుద్దీన్, మున్సిపల్ చైర్ పర్సన్ పెద్దింటి పద్మ, వైస్ చైర్ పర్సన్ నాయకపు వినయ్, డిసిసి ప్రతినిధి రఘునాథ్ రెడ్డి, మాజీ ఎంఎల్సీ పురాణం సతీష్ కుమార్, అధికారులతో కలిసి హాజరై మార్కెట్ కమిటీ చైర్మన్ గా మహేష్ ప్రసాద్ తివారి, వైస్ చైర్ పర్సన్ పాపిరెడ్డి, కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. రైతు రుణమాఫీ పథకంలో భాగంగా 2 లక్షల రూపాయల వరకు రుణం గల రాష్ట్రంలోని రైతుల ఖాతాలలో 23 వేల కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందని తెలిపారు. రైతు భరోసా పథకంలో భాగంగా 9 వేల కోట్ల రూపాయలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో రైతుల వద్ద నుండి అధిక మొత్తంలో పంట ఉత్పత్తులు కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారెంటీ పథకాలను పూర్తి స్థాయిలో అమలుచేసి అర్హులైన లబ్ధిదారులకు అందించే విధంగా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటామని తెలిపారు.

చెన్నూర్ పట్టణంలో బస్ డిపో ఏర్పాటులో భాగంగా భూ వివాదాన్ని త్వరగా పరిష్కరించి డిపో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని, చెన్నూర్ నుండి హైదరాబాద్ కు ప్రస్తుతం నడిపిస్తున్న బస్సులకు అదనంగా మరొక బస్సు ఏర్పాటుకు చర్యలు చేపడతామని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గంలో నీటి పారుదల ప్రాజెక్టు ఏర్పాటు, ప్రజలందరికీ నిరంతరం త్రాగునీటి సరఫరా చేసే విధంగా చేపడుతున్న చర్యలలో భాగంగా అమృత్ పథకం అమలు చేస్తూ నీటి ట్యాంకులు, పైప్ లైన్ ల పనులు కొనసాగుతున్నాయని, తద్వారా ఇంటింటికి నీటిని అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. వచ్చే వేసవిలో నీటి సమస్య లేకుండా 45 కోట్ల రూపాయల ప్రతిపాదనలతో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

చెన్నూర్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా నుండి ట్యాంక్ బండ్ వరకు రహదారి విస్తరణ పనులు త్వరలోనే చేపడతామని, ఈ క్రమంలో వ్యాపారస్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. చెన్నూర్ మున్సిపల్ పరిధిలోని 18 వార్డులలో నగర అభివృద్ధి నిధుల ద్వారా అభివృద్ధి పనులు చేపడతామని, చెన్నూర్ నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మార్కెట్ కమిటీ ప్రతినిధులు రైతు సమస్యలపై నిరంతరం పర్యవేక్షిస్తూ పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని, రైతులకు అవసరమైన పంట మెలకువలు, పంట మార్పిడి విధానం, వాణిజ్య పంటల సాగు, పంట ఉత్పత్తుల విక్రయం ఇతర అంశాలలో రైతులకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతన మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు, సభ్యులు ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉంటూ రైతు సంక్షేమం దిశగా కృషి చేయాలని తెలిపారు. జిల్లాలో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. వరి ధాన్యం, పత్తి ఉత్పత్తులను కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వ నిర్ణీత మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయడం జరుగుతుందని, ఈ క్రమంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అంతకుముందు చెన్నూర్ పట్టణంలోని ఎస్ ఎస్ ఆర్ కన్వెన్షన్ హాల్ లో 10వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల నేపథ్యంలో జైపూర్ ఎ.సి.పి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పరీక్ష పాడ్, పెన్నులను పంపిణీ చేసి వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలని తెలిపారు.

అనంతరం జిల్లా కలెక్టర్ చెన్నూర్ పట్టణంలో కొనసాగుతున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ మండలం పరిశీలించి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. చెన్నూర్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పారిశుధ్య పనులను మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తో కలిసి పరిశీలించారు. గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించి భోజనశాల, పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 9వ తరగతి విద్యార్థులకు స్వయంగా పాఠ్యాంశాలు బోధించి వారి అభ్యాసన సామర్ధ్యాలను పరీక్షించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.