4 August, 2026 | 3:34 AM

అశ్వాపురంలో సోషల్ మీడియా పోస్టులపై రచ్చ.. పరస్పర ఆరోపణలు

04-08-2026 02:12 AM

అశ్వాపురం, ఆగస్టు 3 (విజయక్రాంతి): అశ్వాపురం మండలంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకుల మధ్య పరస్పర ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు, కులాల పేరుతో పోస్టులు వైరల్ అవుతుండటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టులు గ్రామాల్లో సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తూ, రెచ్చగొట్టే ప్రచారంపై పోలీసులు నిఘా పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదిలా ఉండగా, అశ్వాపురంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ ఎస్సీ సెల్ నాయకులు సోషల్ మీడియాలో దళితులను కించపరిచే వ్యాఖ్యలు, పోస్టులను తీవ్రంగా ఖండిస్తూ, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే ఎస్సీఎస్టీ కమిషన్ను ఆశ్రయించడంతో పాటు చట్టపరమైన పోరాటం చేస్తామని ప్రకటించారు.

మరోవైపు, మండలంలో అన్ని కులాల మధ్య సత్సంబంధాలే ఉన్నాయని, దళితులపై దాడులు జరిగినట్లు చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని మరో వర్గం పేర్కొంటూ, ఎవరైనా అన్యాయానికి గురైతే న్యాయవ్యవస్థను ఆశ్రయించాలని, నిరాధార ఆరోపణలతో సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టవద్దని విజ్ఞప్తి చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగిస్తూ శాంతిభద్రతలకు భంగం కలిగించే పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసు అధికారులను కోరుతున్నారు.